రాష్ట్రంలో వెంటిలేటర్​పై 7 వేల ప్రాణాలు

రాష్ట్రంలో వెంటిలేటర్​పై 7 వేల ప్రాణాలు
  •     24 వేలు దాటిన కరోనా ఐపీ కేసులు
  •     బెడ్లు దొరక్క అల్లాడుతున్న రోగులు
  •     2,368కి చేరిన మృతుల సంఖ్య
  •     కొత్తగా 7,430 కేసులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్​ దవాఖాన్లలో కలిపి కరోనా ఇన్​పేషెంట్ల సంఖ్య 24,200 దాటింది. ఇందులో 6,961 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటిలేటర్​పై పెట్టి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. మరో 11,849 మంది ఆక్సిజన్​ సపోర్ట్​తో ఉన్నారు. ఇంకో 5,393 మందిని మామూలు బెడ్లపై ఉంచి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఆక్సిజన్​ వరకూ వెళ్లినవాళ్లలో ఎక్కువ మంది వారం, పది రోజుల్లో కోలుకుంటున్నారు. వెంటిలేటర్​పై ఉన్న వాళ్లు మాత్రం కోలుకోవడానికి ఎక్కువ టైం పడుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  

మరో 56 మంది మృతి

రాష్ర్టంలో ఆరు రోజుల్లో కరోనాకు 326 మంది బలైపోయారు. సోమవారం నుంచి వరసగా ఆరో రోజూ యాభైకిపైగా మరణాలు నమోదవుతున్నాయి. శనివారం కరోనాతో మరో 56 మంది చనిపోయారని బులిటెన్​లో ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,368కి పెరిగినట్టు వెల్లడించింది. అలాగే, రాష్ర్టంలో శనివారం 76,330 మందికి టెస్టులు చేస్తే, అందులో 7,430 మందికి పాజిటివ్​ వచ్చినట్టు ప్రకటించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్​లో 1,546, జిల్లాల్లో 5,884 కేసులు నమోదైనట్టు పేర్కొంది. శనివారం చేసిన టెస్టుల్లో 55,279 టెస్టులను ప్రభుత్వ సెంటర్లలో చేయగా, 21,051 మంది ప్రైవేట్​ సెంటర్లలో చేయించుకున్నారు. టెస్ట్​ కిట్ల కొరతతో సర్కార్​ ఒక్కో సెంటర్​‌‌లో యాభై మందికి మాత్రమే టెస్టులు చేయిస్తోంది. ఆదివారం చాలా సెంటర్లలో అసలు టెస్టులే చేయలేదు. టెస్టుల కోసం వచ్చినవాళ్లంతా నిరాశతో వెనుదిరిగారు.

ఏడికి పోవాలె

కరోనా పేషెంట్లకు ఆక్సిజన్​, వెంటిలేటర్​ బెడ్లు దొరుకుతలేవు. ముఖ్యంగా, సర్కార్​ దవాఖాన్లకు వచ్చే పేద రోగులకు అసలే దొరకట్లేదు. గాంధీ, టిమ్స్​, నిమ్స్​, కింగ్​ కోఠి, చెస్ట్​ వంటి టెర్షియరీ కేర్​ హాస్పిటల్స్​ అన్నింట్లో వెంటిటేర్​ బెడ్లన్నీ ఫుల్​ అయ్యాయి. ప్రైవేట్, కార్పొరేట్​ హాస్పిటళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ, సర్కార్​ బులిటెన్​లో మాత్రం ఇంకో 2,938 వెంటిలేటర్​ బెడ్లు, 6,506 ఆక్సిజన్​ బెడ్లు ఖాళీగా ఉన్నట్టు చూపిస్తున్నారు.