అగ్ని ప్రమాదంతో అమీర్‎పేట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ

అగ్ని ప్రమాదంతో అమీర్‎పేట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ

హైదరాబాద్: అమీర్‎పేట్‎లోని మైత్రీవనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న KSR ఫ్యాషన్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఘటనతో అమీర్‎పేట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్ పేట్-ఎస్ఆర్ నగర్ రూట్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో సిటీ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. 

అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్ మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో అత్యవసర సహాయక చర్యల కారణంగా అమీర్‌పేట నుంచి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర సహాయక చర్యల వల్ల అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. 

ఈ భారీ అగ్ని ప్రమాదంతో అమీర్ పేట్ మొత్తం నల్లటి పొగ అలుముకుంది. పొగ దట్టంగా కమ్మేయడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం సాహసించలేకపోతున్నారు స్థానికులు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేస్తుంది. 

మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలిబూడిద అవుతుంది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు.

విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు.