
కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’.
కె.కె.రాధామోహన్ తెలుగులో విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా
ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా గురించి కార్తి చెప్పిన విశేషాలు..
పదేళ్లు జైలుశిక్ష అనుభవించి బయటకి వచ్చిన ఓ ఖైదీ కథ. నాలుగ్గంటల వ్యవధిలో జరుగుతుంది. ఎలా ఉంటుందో కూడా తెలియని తన పదేళ్ల పాపని చూడాలనేది అతని కోరిక. ప్రమాదం ఎటునుంచైనా, ఎప్పుడైనా రావొచ్చు అనే పరిస్థితుల్లో తన కూతుర్ని కలుసుకోగలిగాడా అనేది క్లైమాక్స్. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకుంటాయి.
నాక్కూడా ఓ కూతురుంది కనుక ఆ పాత్ర సునాయాసంగా చేసేశాను. అయితే పదేళ్లు చూడలేదనేది మాత్రం చాలా పెయిన్ఫుల్ ఫీలింగ్. అతను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది లాంటి కారణాలతో ఫెర్ఫార్మెన్స్‌కి స్కోప్ లభించింది. దానికి తోడు భారీ యాక్షన్ సినిమా. వెరీ గుడ్ కాంబినేషన్.
షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన దర్శకుడిగా కథని డిఫరెంట్ స్టైల్లో నెరేట్ చేశాడు లోకేష్ కనకరాజ్. ఇదో చిన్న సబ్జెక్ట్. కానీ కొత్త ఐడియా.. నచ్చితే చేయండి అన్నాడు. విన్నాక నాకది డైహార్డ్ లాంటి పెద్ద సినిమాలా తోచింది. ఆర్నాల్డ్ లాంటి హాలీవుడ్ స్టార్ చేయదగ్గ భారీ యాక్షన్ మూవీలా కనిపించింది.
కొత్త వాళ్లెప్పుడూ తమ జీవితంలో చూసినవి రాస్తారు కనుక ప్రతి సీన్, డైలాగ్ ఫ్రెష్‌గా ఉంటాయి. ఇది ఒక రకంగా న్యూ ఏజ్ యాక్షన్ మూవీ. రాత్రి నేపథ్యంలో రియాలిటీగా దగ్గరగా ఉంటుంది. అదే సమయంలో నాది మాస్ క్యారెక్టర్. ఇలాంటి ఫాస్ట్ ఫేజ్ యాక్షన్ మూవీ మధ్యలో ఎమోషన్ పెట్టడానికి దర్శకుడికి చాలా ధైర్యం కావాలి. ఎమోషన్ చాలా బలంగా పండింది. అందుకే ఇది యూనిక్ మూవీ.
టైటిల్ ప్రకటించిన రోజు నుండి సినిమాపై స్పెషల్ అటెన్షన్ వచ్చింది. చిరంజీవి గారి హిట్ మూవీ టైటిల్ అని పెట్టలేదు. ఖైదీ చుట్టు తిరిగే కథ కనుక తమిళంలో కూడా ఇదే టైటిల్ నిర్ణయించాం. మామూలుగా ఇలాంటి సినిమా రెండు గంటలుంటుంది. కానీ ఇది రెండు గంటల ఇరవై నిముషాల సినిమా. కథపై కాన్ఫిడెన్స్ ఉంది కనుకే ఆ నిడివితో వస్తున్నాం.
పల్లెటూరి ప్రేక్షకులు కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో వచ్చే ఇంటర్నేషనల్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మనమూ ఆ స్థాయిలో వర్క్ చేయాలి. అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసేటప్పుడు సాంగ్స్, రొమాన్స్ లేకుండా ఇలాంటి ఫుల్ యాక్షన్ మూవీ చేయాలనుకునేవాడిని. ఈ సినిమాతో అది తీరింది.
‘ఖాకీ’ తెలుగులోనూ బాగా ఆడింది. ఇక్కడ నా నుంచి డిఫరెంట్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాతో వస్తున్నాను. 15–25 మధ్య వయసు గల ప్రేక్షకులు సినిమా జయాపజయాలను నిర్ణయిస్తున్నారు. వాళ్లకిది తప్పక నచ్చుతుంది. పండుగలకి ప్రతి ఒక్కరూ సినిమా చూడాలనుకుంటారు. రెండు చిత్రాలు వస్తే వాళ్లకి నచ్చింది చూస్తారు. రెండు బాగున్నాయంటే ఒకదాని తర్వాత మరొకటి చూస్తారు.
ప్రస్తుతం ‘సుల్తాన్’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత వదిన జ్యోతిక నాకు అక్కగా నటిస్తున్న చిత్రంలో నటిస్తాను. ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకుడు. అదో ఫ్యామిలీ థ్రిల్లర్.