మహిళా రిజర్వేషన్లతో పెను మార్పులు : బీజేపీ ఎంపీ డీకే అరుణ

మహిళా రిజర్వేషన్లతో  పెను మార్పులు :  బీజేపీ ఎంపీ డీకే అరుణ
  •   బీజేపీ ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే.అరుణ అన్నారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దశాబ్దాలుగా పెండింగ్‌‌‌‌ ఉన్న 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌‌‌‌లో ఆమోదించి, ప్రధాని చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. 

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా కనీసం 9 ఎంపీ, 60 ఎమ్మెల్యే స్థానాలు మహిళలకు దక్కే అవకాశం ఉందని చెప్పారు. 

దేశవ్యాప్తంగా 273 మంది మహిళా ఎంపీలు లోక్‌‌‌‌సభలో అడుగుపెట్టబోతున్నారని, ఇది మహిళా లోకానికి గర్వకారణమని పేర్కొన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ తన హయాంలో చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బిల్లు తీసుకొస్తే, దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.