హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులే షాక్ అయ్యే సంఘటన జరిగింది. ఓ మందుబాబు తెలివితేటలు చూసి ఖంగుతినడం పోలీసుల వంతైంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోతామనో.. లేక ట్రాఫిక్ చలాన్లకు చెక్ పెట్టాలనో తెలీదు కానీ ఓ వాహనదారుడు తన కార్‌లో ఏకంగా ఒక జేమ్స్ బాండ్ లెవల్ టెక్నాలజీని వాడేశాడు.
కారు నెంబర్ ప్లేట్ మార్చాలంటే కిందకు దిగక్కర్లేదు జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ మారిపోయేలా ఒక ప్రత్యేక పరికరాన్ని సెట్ చేసుకున్నాడు ఈ కిలాడీ డ్రైవర్. పోలీసుల కళ్లుగప్పి వేర్వేరు నెంబర్ ప్లేట్లతో బురిడీ కొట్టించాలని చూసిన ఈ మందుబాబు వ్యవహారం జూబ్లీహిల్స్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయింది.
కారులోని ఆ వింత పరికరాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. మద్యం మత్తులో దొరికిన ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడమే కాకుండా ఆ నెంబర్ ప్లేట్ మార్చే సిస్టమ్‌ను చూసి విస్తుపోతున్నారు పోలీసులు. ప్రస్తుతం కారును సీజ్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దీని వెనుక ఇంకా ఎలాంటి మాయాజాలం ఉందో ఆరా తీస్తున్నారు.
