- మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా పెట్టాల్సిందే: కవిత
- ఉపకోటా కోసం కేంద్రం వెన్నులో వణుకుపుట్టేలా పోరాడుతామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ పాలకులకు బీసీలంటే భయం లేకుండా పోయిందని, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్‌కోటా పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాగృతి ఎంత కమిటెడ్‌గా ఉద్యమం చేసిందో బీసీ సబ్ కోటా కోసం అంతే కమిట్ మెంట్ తో పనిచేస్తుందని తేల్చిచెప్పారు.
మహత్మా జ్యోతిరావ్ పూలే 200వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
మహత్మా పూలేనే మళ్లీ పుట్టారా అనే స్థాయిలో తమ పోరాటం ఉంటుందన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రావటంలో జాగృతి ఉద్యమమే కీలకమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అంతటితో ఆగకుండా బీసీలకు ఉపకోటా వచ్చే వరకు పోరాడుదామన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరగనున్న నేపథ్యంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. బీసీ కోటా కోసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతామని అన్నారు. అధికార బలం ఉందని బీసీ కోటా లేకుండా బిల్లు పాస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పూలే విగ్రహంపై నిర్లక్ష్యం తగదు
కాగా, ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాల్సిన పూలే విగ్రహం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని జాగృతి డిమాండ్ చేస్తే.. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. పూలే జయంతి నాటికి కూడా విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు చేశారే తప్ప పూలే విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదన్నారు.
ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి రోజు నాటికైనా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కవిత తన పార్టీ జెండాలోని రంగును ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు. నీలిరంగులో జెండా ఉంటుందని స్పష్టం చేశారు. బలహీనవర్గాలే ఎజెండాగా జెండాను రూపొందిస్తున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి.
