జీవన్ రెడ్డి.. ఆత్మను చంపుకొని కేసీఆర్ ను కౌగిలించుకుండు : విప్ ఆది శ్రీనివాస్

జీవన్ రెడ్డి.. ఆత్మను చంపుకొని కేసీఆర్ ను కౌగిలించుకుండు : విప్ ఆది శ్రీనివాస్
  •     బీఆర్ఎస్‌‌లో చేరాలనుకోవడం.. ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే:  విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, వెలుగు: జీవన్ రెడ్డి తన ఆత్మను చంపుకొని కేసీఆర్ ను కౌగిలించుకున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయం తీసుకోవడం అంటే తన ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టేనని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా 40 ఏండ్ల పాటు ఆయనకు అండగా నిలిచి.. అనేక పదవులు కట్టబెట్టిన పార్టీని విడిచిపెట్టి కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్ రెడ్డి వెళ్లడం దురదృష్టకరమన్నారు. 

గతంలో కూడా ఇలానే ఎందరో కాంగ్రెస్ సీనియర్లు పార్టీపై అలిగి బీఆర్ఎస్ లో చేరారని, ఇప్పుడు వారి రాజకీయ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి జీవన రెడ్డి తెలుసుకుంటే బాగుండేదని అన్నారు. కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పదేండ్ల పాటు పోరాడానని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డి.. మరి ఆయనతో కలిసి పనిచేయమని దేవుడు కేసీఆర్ వద్దకు ఎలా పంపించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అవినీతిపరులతో, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెప్తాడా? అని జీవన్ రెడ్డిని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.