ఇజ్రాయెల్ ఐరన్ డోమ్​పై హిజ్బుల్లా అటాక్

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్​పై  హిజ్బుల్లా అటాక్

జెరూసలెం: హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై అటాక్ చేస్తున్న ఇజ్రాయెల్ కు గట్టి షాక్ తగిలింది. హమాస్ కు మద్దతుగా తాము ఇజ్రాయెల్ పై ఎదురుదాడులు జరిపామని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మంగళవారం  పేర్కొంది. ఈ  అటాక్ లో  ఇజ్రాయెల్​లోని కబ్రి ఏరియాలో  ఉన్న రెండు ఐరన్ డోమ్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. అయితే, హిజ్బుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించలేదు. 

అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దీంతో హమాస్​కు మద్దతుగా హిజ్బుల్లా  రంగంలోకి దిగింది. చాన్స్ దొరికినప్పుడల్లా ఇజ్రాయెల్​పై రాకెట్లు, మోర్టార్ షెల్స్​ను ప్రయోగిస్తున్నది.హిజ్బుల్లా తమపై ఇలాగే దాడులు కొనసాగిస్తే.. లెబనాన్​ను మరో గాజా వలె మార్చేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐరన్ డోమ్ లపై హిజ్బుల్లా చేసిన దాడి యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసినట్లయ్యింది.