- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విషపూరిత రసాయనాలతో కూడిన పారాక్వాట్ పురుగు మందు తయారీ, పంపిణీ, విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తెలియజేయాంటూ హైకోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. విషపూరితమైన రసాయనాల కట్టడికి ఏవైనా మార్గదర్శకాలు, చట్టాలు ఉంటే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పారాక్వాట్ పురుగు మందు వినియోగం వల్ల ఏటా 200 మంది మృతి చెందుతున్నారంటూ హైకోర్టుకు లేఖ అందింది.
ఇది విషపూరితమైన రసాయనమని, తక్కువ పరిణామంలో వాడినా ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ మందును యూరోపియన్ యూనియన్‌తోపాటు చైనా, బ్రెజిల్‌లో నిషేధించినట్లు తెలిపారు. దీని వినియోగంపై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, నోటీసులు జారీ చేస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
