హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్‌ల కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతుంటే మరోవైపు రిజర్వేషన్‌లపై చివరి క్షణంలో కోర్టుకు వస్తే ఎలా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వార్డుల రిజర్వేషన్‌లను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9, 14లను సవాలు చేస్తూ బోడుప్పల్‌కు చెందిన జి. రమణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎక్కువ శాతం మున్సిపాలిటీల్లో రిజర్వేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్‌ల కేటాయింపులో చట్టబద్ధమైన ప్రాతిపదికను అనుసరించలేదని చెప్పారు.
ఎలాంటి కారణం లేకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్న వార్డులను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్‌లను చట్టప్రకారమే కేటాయించామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
