- జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
- మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని రోడ్ల ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాల్సిందేనని జీహెచ్ఎంసీకి హైకోర్టు తేల్చి చెప్పింది. పన్నులు చెల్లించే ప్రజలు ఫుట్‌పాత్‌లు లేక రోడ్లపై నడుస్తూ ట్రాఫిక్‌లో ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాగ్‌లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగించకుంటే కూల్చివేస్తామంటూ జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఇందుమతి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్ విషయంలో డాక్యుమెంట్ 700 చదరపు గజాలుండగా అది 1052 గజాలుగా చూపిన విషయాన్ని ఆస్తి పన్ను మదింపు చేసే సమయంలో కూడా అధికారులు గుర్తించలేదన్నారు. మున్సిపల్ అధికారులు వాణిజ్య పన్ను మదింపు చేసి వసూలు చేయడానికి పరిమితమవుతున్నారని, అంతేగానీ ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్నారన్న విషయాన్ని పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు శిథిలావస్థలో ఉన్నాయని, ఎక్కువ శాతం అనధికారిక నిర్మాణాలతో ఆక్రమణలకు గురయ్యాయని వాటిని తొలగించాల్సి ఉందన్నారు. తొలగింపునకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. అధికారుల ఉదాసీనతపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులపై మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీకి ఉత్తర్వులు జారీ చేశారు.
