హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో జోక్యం చేసుకునే పరిధి కోర్టులకు పరిమితంగా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పక్షపాతం, దురుద్దేశం, అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉంటే తప్ప టెండర్ల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు తలదూర్చవని తెలిపింది. ఇప్పటికే ఉన్న టెండర్లను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే అధికారం టెండరింగ్ అథారిటీకి ఉంటుందని తేల్చి చెప్పింది.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వేములవాడలో రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం సుమారు రూ.50 కోట్ల విలువైన టెండర్లు పిలిచింది.చొప్పదండి మండలం అర్నకొండ నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు, అలాగే.. వేములవాడ నుంచి సిరికొండ వరకు రహదారి పనుల కోసం 2025 నవంబరులోనే తొలి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత అధికారులు పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఈ ఏడాది కొత్తగా టెండర్లు ఆహ్వానించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 'శ్రీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్' సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..కొత్త నోటిఫికేషన్‌లో కాంట్రాక్ట్ విలువను పెంచడమే కాకుండా.. పనులు పూర్తి చేయాల్సిన గడువును 18 నెలల నుంచి 12 నెలలకు తగ్గించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ..గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే గడువు తగ్గించామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పుతో ఏకీభవించింది. శ్రీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
