- జూన్ 9న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన బెంచ్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 'ఫాం-1' నోటీసులు జారీ చేసింది. జూన్ 9న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారంలోని సర్వే నంబర్ 105లో గల రెండు ప్లాట్లను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా స్వాధీనం చేసుకుంది.
దీన్ని సవాల్ చేస్తూ బాధితుడు జితేంద్ర మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ వివాదంపై ఏప్రిల్ 13న విచారణ చేపట్టిన హైకోర్టు.. సదరు స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డులను 48 గంటల్లోగా తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నెల రోజులు గడుస్తున్నా బోర్డులను తొలగించకపోవడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ రావు వాదిస్తూ.. ఏప్రిల్ 23న ధిక్కరణ నోటీసు ఇచ్చినా హైడ్రా స్పందించలేదని, ఇది ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనని కోర్టుకు వివరించారు.హైడ్రా తన చర్యను సమర్థించుకోవడానికి సంబంధించి అటు కౌంటర్ అఫిడవిట్ గానీ, ఇటు స్టేటస్ రిపోర్ట్ గానీ సమర్పించకపోవడంపై జస్టిస్ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? అని ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కోరుతూ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణను జూన్ 9కి వాయిదా వేశారు.
