డిప్లొమా లేకుండా ఎంపికైన ఏఈలకు హైకోర్టు నోటీసులు

డిప్లొమా లేకుండా ఎంపికైన ఏఈలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కనీస అర్హత అయిన డిప్లొమా లేకుండా బీటెక్, బీఈ డిగ్రీలతో ఏఈ తదితర పోస్టులకు ఎంపికైన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వీరిని కేసులో ప్రతివాదులుగా చేర్చడానికి అనుమతించింది. మొత్తం 614 మంది ఎంపికైన అభ్యర్థుల తరఫున.. ఆయా శాఖల్లో ఉన్న 65 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ జస్టిస్ కె.శరత్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను కోర్టు జూన్ 25కు వాయిదా వేసింది.

టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ ప్రకారం.. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేని బీటెక్ అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ కొలకాని శశికుమార్, మరో ఎనిమిది మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. డిప్లొమా అర్హత లేకుండా అసిస్టెంట్ ఇంజనీరు, మున్సిపల్ ఏఈ, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 787 మంది తాత్కాలికంగా ఎంపికయ్యారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వీరిలో కేవలం 173 మందికి మాత్రమే నిర్దేశించిన డిప్లొమా అర్హత ఉందన్నారు.మిగిలిన 614 మందిని కేసులో ప్రతివాదులుగా చేర్చడం ఆచరణలో సాధ్యం కాదని న్యాయవాది కోర్టుకు వివరించారు. అందుకే ఆ 614 మందికి ప్రాతినిధ్యం వహించేలా, వివిధ శాఖల వారీగా 65 మందిని ప్రతివాదులుగా చేర్చడానికి అనుమతించాలని కోరారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులు మొత్తం 614 మందికీ వర్తిస్తాయని చెప్పారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. 65 మంది అభ్యర్థులతో పాటు వారు ఎంపికైన మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, భూగర్భ జలశాఖ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ, నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చడానికి అనుమతిస్తూ నోటీసులు జారీ చేశారు.