- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పిటిషన్‌పై విచారణ క్లోజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బంకర్ బెడ్ల సరఫరా ఒప్పందంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. విజిలెన్స్ శాఖ రాసిన లేఖ ఆధారంగా నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని 252 కస్తూర్బా పాఠశాలలకు 45,360 బంకర్ బెడ్లు, పరుపులు, దిండ్ల సరఫరాకు సంబంధించిన ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మార్కెట్లో రూ. 15 వేల నుంచి 17 వేల వరకు ఉన్న ఒక్కో బెడ్ ధరను, రూ. 33 వేలకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అదనపు ధరల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 100 కోట్లకు పైగా భారం పడుతుందని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు.
ప్రభుత్వాలు కుదుర్చుకునే ఒప్పందాల్లో న్యాయ సమీక్ష పరిమితంగానే ఉంటుందని, నిర్ణయం దురుద్దేశపూర్వకంగా లేదా చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు. పిటిషనర్ ఫిర్యాదుపై అధికారులు స్పందించలేదనడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం.. పిటిషనర్ వినతి అందిన వెంటనే విజిలెన్స్ శాఖ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాస్తూ విచారణకు సూచించిందని గుర్తు చేశారు. అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభిస్తున్నందున, విజిలెన్స్ లేఖ ఆధారంగా విచారణను వేగవంతం చేసి సకాలంలో చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు ఈ పిటిషన్‌ను మూసివేసింది.
