హైదరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలో హౌసింగ్ బోర్డు నిర్మించిన కాలనీలో రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా ఆక్రమణలను ప్రోత్సహించిన అధికారులపైనా విచారించి చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసి నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి అందజేయాలని ఆదేశించింది.
బాగ్‌లింగంపల్లిలో హెచ్‌ఐజీ-2కు పడమర, ఉత్తరం వైపు రోడ్ల ఆక్రమణలపై వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో ఎల్.అరుణ్‌కుమార్ మరో 13 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆక్రమణలు, సమస్యలకు సంబంధించిన ఫొటోలను పరిశీలించిన జడ్జి ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. బాగ్‌లింగంపల్లి హౌసింగ్ బోర్డు మొత్తానికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు.
