- మెట్రోకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టిన మెట్రో రెండో దశ పనుల అలైన్‌మెంట్‌ను వీడియో రూపంలో సమర్పించాలంటూ మెట్రోకు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. మెట్రో అలైన్‌మెంట్‌లో ఉల్లంఘనలపై కూడా వీడియో సమర్పిస్తామన్న పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. వారసత్వ కట్టడాలకు ప్రమాదకరంగా మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ పిల్ దాఖలు చేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ గత విచారణ సందర్భంగా వీడియో రూపంలో అలైన్‌మెంట్ సమర్పిస్తామని హామీ ఇచ్చామని, అయితే వీడియో పూర్తయినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సమర్పించలేకపోయామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.
