- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పటికి చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయిన పరిస్థితిలో ఇంజినీరింగ్ కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించింది. ప్రభుత్వం ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు విడుదల చేయకుండా, మరోవైపు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని చెబితే ప్రస్తుత అడ్మిషన్ల ప్రక్రియ ఎలా సాగుతుందని కోర్టు నిలదీసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారణ చేపట్టారు. కాలేజీల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, గతంలో తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం మళ్లీ కొత్త జీవో జారీ చేసిందని తెలిపారు.
అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, రీయింబర్స్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందన్నారు. అయితే కేంద్రం తన వాటా విడుదల చేయకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాలని కోరుతోందని వివరించారు. దీంతో మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోందని చెప్పారు. ఈ విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే అంత సమయం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. బకాయిలు ఎప్పటికి చెల్లిస్తారో నిర్దిష్ట తేదీ చెప్పాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
