- ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
- అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ అభ్యర్థనపై నేడు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారం వాయిదా వేసింది. దీనిపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే, తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషనర్ చేసిన అభ్యర్థనపై మాత్రం శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపింది. పిటిషనర్ భగీరథ్ వాదనలతోపాటు బాధితురాలి వాదనలు విన్నాకే ఈ ఉత్తర్వులు ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో బాధితురాలి పుట్టినతేదీపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. భగీరథ్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బాధితురాలి వయసుపై సందేహాలను జడ్జి జస్టిస్ టి. మాధవీ దేవి దృష్టికి తీసుకొచ్చారు. డ్రైవింగ్ చేస్తూ 2021లో పట్టుబడినప్పుడు పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ఆమె వయసు15 ఏళ్లుగా పేర్కొన్నట్లు చెప్పారు. దీని ప్రకారం ఆమె వయసు ఇప్పుడు18 ఏళ్లు నిండి ఉంటాయన్నారు. ఇక జీహెచ్ఎంసీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ లో 2008లో పుట్టినట్టుగా ఉందని, పాన్ కార్డులో 2010లో జన్మించినట్టు ఉందని తెలిపారు.
కేసును కొట్టివేయాలని కోరడంలేదని, కేవలం మధ్యంతర రక్షణ కల్పించాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. పోక్సో కేసు తీవ్రమైనదేనని, కానీ చట్టం ప్రకారం ముందస్తు బెయిలు ఇవ్వడానికి నిషేధం లేదన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయన్నారు. అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇస్తే పిటిషనర్ పోలీసుల దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బాధితురాలి తరఫు న్యాయవాది పీపీ నాగేశ్వర్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బాలిక నుంచి గురువారం వాంగ్మూలం నమోదు చేశారని, అదనపు సెక్షన్‌లు జోడించారని.. వీటి ప్రకారం20 ఏళ్లు యావజ్జీవ శిక్ష పడుతుందన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వరాదన్నారు.
న్యాయవాదుల వాగ్వాదం.. జడ్జి అసహనం
మధ్యంతర రక్షణ కల్పిస్తే దర్యాప్తునకు సహకరించడానికి పిటిషనర్ సిద్ధంగా ఉన్నాడని అతడి తరఫు న్యాయవాది చెప్పగా, ప్రతి క్రిమినల్ ఇదే చెబుతారని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది చెప్పారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అక్రమ నిర్బంధంలో లేడన్నారు. క్రిమినల్ అనడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరూ సీనియర్ న్యాయవాదులేనని సంయమనం పాటించాలని, లేదంటే కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తానన్నారు.
కేసులోని అంశాలపై వాదనలు వినిపించాలని, వ్యక్తిగతంగా వెళ్లరాదన్నారు. కేసు రుజువయ్యేదాకా నిందితుడు నిర్దోషేనని, క్రిమినల్ అని అనడం సరికాదన్నారు. బాధితురాలి పుట్టిన తేదీకి సంబంధించి పోలీసులు స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి వాదనలు వినిపించాలని ఫిర్యాదు తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు
