- బొగ్గు రవాణాపై ఉన్నత స్థాయి సమీక్ష
- ఒడిశాలో అంగూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో సింగరేణి ఆఫీసర్ల భేటీ
హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి రోజుకు12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బుధవారం బొగ్గు గని ఉన్న అంగూల్ జిల్లా కలెక్టర్ ఎం. అబ్దుల్ అక్తర్, జిల్లా ఎస్పీ రాహుల్ జైన్‌తో సింగరేణి ఆఫీసర్లు భేటీ అయ్యారు. నైనీ బొగ్గు రవాణాపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సింగరేణి పర్సొన్నెల్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, కోల్ మూవ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ వినియోగదారులైన జిందాల్ స్టీల్, జిందాల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ పొట్రు మాట్లాడుతూ.. ‘నైనీ బొగ్గు గని నుంచి ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కానున్నది. రోజుకు కనీసం12 వేల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. బొగ్గును సమీపంలోని విద్యుత్ కేంద్రాలతో పాటు, తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి, తమిళనాడు జెన్కో విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు రవాణా ఏజెన్సీలు ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యాల మేరకు వినియోగదారులకు బొగ్గు అందించడానికి సహకరించాలి. వినియోగదారులు కూడా చొరవ చూపాలి’’ అని కోరారు.
ఏజేన్సీల సహాకారం కీలకం..
నైనీ బొగ్గు గని నుంచి రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా కోసం సమీపంలోని హిందొల్ రైల్వే సైడింగ్ నుంచి కామాఖ్య నగర్ సైడింగ్ వరకు బొగ్గు రవాణా చేయడంలో ఏజెన్సీలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోల్ మూవ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న కోరారు. దీనిపై వినియోగదారులు స్పందిస్తూ.. తమకు అవసరమైన బొగ్గును రోజువారి కేటాయింపు ప్రకారం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని, బొగ్గు రవాణాదారులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గును స్వీకరిస్తామన్నారు. బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు మాట్లాడుతూ.. లక్షల టన్నుల మేరకు బొగ్గును రవాణా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. బొగ్గు రవాణా మార్గంలో కొన్నిచోట్ల ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశంలో చర్చించారు. రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణాలో ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని అంగూల్ జిల్లా కలెక్టర్ ఎం. అబ్దుల్ అక్తర్, జిల్లా ఎస్పీ రాహుల్ జైన్‌ను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. నైనీ ఏరియా జనరల్ మేనేజర్ డి. బైద్య, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
