హైదరాబాద్ లో డీజీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లో  డీజీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్యకు  నిరసనగా రాష్ట్ర బీజేపీ డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించింది. దీంతో లక్డీకపూల్ లోని డీజీపీ ఆఫీసు దగ్గరకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు భారీ కేడ్లపై దూకేందుకు యత్నించారు.దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా.. ఫిబ్రవరి 9న రాత్రి  మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. మహదేవప్ప మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యర్థుల వేధింపులతోనే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.   ఎన్నికలకు ఒక్క రోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.