లాహౌల్-స్పితి: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–-స్పితి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి ఓ టాటా సుమో మట్టి, బండరాళ్ల కింద పూడుకుపోవడంతో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కుల్లు నుంచి పాంగికి వెళ్తున్న టాటా సుమో.. ఉదయ్‌పూర్-కిల్లార్ మార్గంలోని 'కాహు-దు నాలా' సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున బండరాళ్లు, మట్టి వచ్చి మీద పడటంతో వాహనం మట్టిదిబ్బల కింద చిక్కుకుపోయింది.
ఈ ఘటనలో డ్రైవర్ బీర్ సింగ్‌తో సహా 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందు వేరొక చోట కొండచరియలు విరిగిపడటంతో గురువారం అధికారులు ఉదయ్‌పూర్-కిల్లార్ రహదారిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు 'టిండి' ప్రాంతంలోనే రాత్రికి వేచి ఉండాల్సి వచ్చింది. శుక్రవారం నాటికి రోడ్డును పునరుద్ధరించడంతో టాటా సుమో పాంగికి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఊహించని విషాదం చోటుచేసుకుంది.
