V6 News

మన బంగారు తల్లి హిమదాస్‌‌ గెలుపు జర్నీ

మన బంగారు తల్లి హిమదాస్‌‌ గెలుపు జర్నీ

మొన్న ఇంగ్లండ్‌‌లో వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ వేదికపై మన జెండా ఎగరలేదని చాలామందికి బాధేసి ఉంటుంది.ఇంగ్లండ్‌‌లో ఎగరకపోతేనేం.. యూరప్‌‌లో మన జెండా వరసగా ఐదుసార్లు రెపరెపలాడింది. ‘ఒకటోసారి.. రెండోసారి..మూడోసారి’ అంటూ ఐదుసార్లు దేశ జెండాను ప్రపంచ వేదికపై  ఎగరేసింది పందొమ్మిదేళ్ల స్టార్‌‌‌‌ స్ప్రింటర్. అదీ కేవలం మూడు వారాల వ్యవధిలోనే! ఇప్పుడు ఎవరి వాట్సాప్‌‌ స్టేటస్‌‌ చూసినా… ఏ సెలబ్రిటీ ట్వీట్‌‌ చూసినా ఈ ‘గోల్డెన్‌‌ గర్ల్​’ గురించే. చాలామందికి తెలియని ‘బంగారు తల్లి’ హిమదాస్‌‌ గెలుపు జర్నీ గురించి..

కైండ్‌‌‌‌ హార్ట్‌‌‌‌

సర్క్యూట్‌‌‌‌లో చాంపియన్ అనిపించుకున్న హిమ.. తనది కైండ్ హార్ట్‌‌‌‌ అని కూడా అనిపించుకుంది. భారీ వర్షాలతో  అస్సాం రాష్ట్రం వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కోట్లు సంపాదించే ఆటగాళ్లు ‘అస్సాంని దేవుడు కాపాడాలని’ ట్వీట్లు చేస్తుంటే.. హిమ మాత్రం ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ నుంచి తనకు వచ్చే జీతం నుంచి సగం అస్సాం ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ఇచ్చింది. ‘అస్సాంలో వరదల పరిస్థితి దారుణంగా ఉంది. 33 జిల్లాల్లో 30 జిల్లాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ కష్ట సమయంలో మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని అందరినీ కోరుతున్నాను’’ అని ట్వీట్‌‌‌‌ చేసింది.

పేద రైతు బిడ్డ

హిమది అస్సాంలోని నాగోన్‌‌‌‌ జిల్లా దీంగ్‌‌‌‌ టౌన్‌‌‌‌ పక్కన ఉన్న చిన్న గ్రామం. తండ్రి రంజిత్‌‌‌‌ దాస్‌‌‌‌ రైతు. వరి పండిస్తాడు. తల్లి జొమాలీదాస్‌‌‌‌ కూడా వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంది. వాళ్లకు ఐదుగురు బిడ్డలు. వాళ్లలో హిమ చిన్నది. ఆమె స్కూల్‌‌‌‌లో, ఇంటికొస్తే పొలాల్లోనే ఫుట్‌‌‌‌బాల్ ఆడేది. రన్నింగ్‌‌‌‌ చేసేది. దీంగ్‌‌‌‌లో పుట్టిన హిమను ‘దీంగ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌’ అని ముద్దుగా పిలుచుకుంటారు.  అండర్‌‌‌‌‌‌‌‌ 19 వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ గెలిచినప్పుడు తన ఆనందాన్ని వాళ్ల పేరెంట్స్‌‌‌‌తో పంచుకోలేకపోయింది. ఆ ఊళ్లో మొబైల్‌‌‌‌ కనెక్టివిటీ తక్కువ. కాల్‌‌‌‌ చేస్తే కలవలేదట. అండర్‌‌‌‌‌‌‌‌ 19 వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ గెలిచిన తర్వాత మీ కూతురు కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఆడనుంది.. ఎలా ఫీల్‌‌‌‌ అవుతున్నారని హిమ తల్లిని అడిగితే.. ‘‘కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ అంటే ఏంటి? నా బిడ్డ టీవీలో కనిపిస్తుందా?’ అని అడిగింది! ఇంటర్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ చేసిన హిమ ఇప్పుడు ఫుల్‌‌‌‌ టైం పరుగు మీదే దృష్టి పెట్టింది.

‘‘మన కలల్ని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు..  మనలోనే సూపర్ హీరో ఉన్నాడని నమ్మినప్పుడు.. ఏ గోల్‌‌‌‌ అయినా దూరంగా ఉండదు. ఏ ఛాలెంజ్ అయినా కష్టం అనిపించదు.’’

‌‌‌‌ఐదో గోల్డ్ సాధించిన తర్వాత సోషల్‌‌‌‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌‌‌‌ ఇది.

మూడేళ్ల కిందే రన్నింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌

‌‌‌‌హిమ ముందు స్ప్రింటర్‌‌‌‌‌‌‌‌ కాదు. ఫుట్‌‌‌‌బాల్ అంటే ఇంట్రెస్ట్. ఆమె స్కూల్‌‌‌‌లో ఉన్నప్పుడు అబ్బాయిలతో  ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌  ఆడేది. ఇండియన్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టీంలో ఆడాలనేది ఆమె కల. అయితే.. ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌  ఆడుతున్నప్పుడు ఆమె రన్నింగ్‌‌‌‌ స్పీడ్‌‌‌‌ చూసి వాళ్ల స్కూల్‌‌‌‌ పీఈటీ షంషుల్‌‌‌‌ షేక్‌‌‌‌ ఇంప్రెస్‌‌‌‌ అయ్యాడు. ‘మన దేశంలో ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌కి ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ లేదు’ అని  కన్విన్స్‌‌‌‌ చేయడంతో మూడేళ్ల కిందే హిమ అథ్లెటిక్స్‌‌‌‌కి మారింది. ఆమె కోసం ఖర్చుపెట్టేంత డబ్బు అతని దగ్గర లేదు. వాళ్ల ఊళ్లో ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వడానికి కావాల్సిన సౌకర్యాలూ లేవు. అయితే, 2016లో ఇంటర్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ మీట్‌‌‌‌లో 100, 200 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్‌‌‌‌ సాధించినప్పుడు కోచ్‌‌‌‌ నిపోన్‌‌‌‌ మొదటిసారి ఆమెను చూశాడు. ‘ ఆమె ‘లో క్వాలిటీ’ షూస్ వేసుకుంది. అయినా రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ సాధించింది. మీ అమ్మాయి భవిష్యత్తులో పెద్ద అథ్లెట్‌‌‌‌ అవుతుంది. నాతో గౌహతికి పంపించండి’ అని హిమ తల్లిదండ్రులని అడిగాడు. వాళ్ల ఊరి నుంచి గౌహతి 140 కిలోమీటర్లు. ముందుగా  దానికి వాళ్లు ఒప్పుకోలేదు. అంత దూరం మేం పంపించలేం. అన్ని ఖర్చులు మేం భరించలేమన్నారు. ‘అంతా నేను చూసుకుంటా’ అని నిపోన్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌ పెట్టడంతో చివరికి ఒప్పుకున్నారు.

ఆ ట్వీట్‌‌‌‌ తర్వాతే ఫేమస్‌‌‌‌

‘అండర్‌‌‌‌‌‌‌‌ 19 వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌మెడల్‌‌‌‌ గెలిచిన  మొదటి ఇండియన్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌గా 2018, జులైలో హిమదాస్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ల్లోకి ఎక్కింది. 400 మీటర్ల పరుగులో హిమదాస్ కెరీర్ బెస్ట్, ఇండియా బెస్ట్ 50.79 సెకన్స్ నమోదు చేసింది.’ అయితే, ఆ విషయం  మాత్రం ఆ రోజు రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేసేదాక దేశంలో ఎవరికీ తెలియదు. హిమ ఒక ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడుతూ.. ‘ఫిన్లాండ్‌‌‌‌లో నేను రేస్‌‌‌‌లో గెలిచిన విషయం ఎవరికీ తెలియదు. ‘వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌మెడల్‌‌‌‌ సాధించిన మొదటి అథ్లెట్‌‌‌‌ హిమ దేశానికి గర్వకారణం’ అంటూ  రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. గోల్డ్‌‌‌‌ గెలిచిన ఫస్ట్ గర్ల్‌‌‌‌ని నేనే అని ఆ ట్వీట్ చూసేవరకు నాకూ తెలియదు. ఆ రోజు స్పెషల్‌‌‌‌ ఏం లేదు. మెడల్‌‌‌‌ తీసుకుని వెళ్లి పడుకున్నాను. తెల్లారి నా ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ఓపెన్ చేసి చూశాను. నా ఫొటోస్‌‌‌‌  నాకే కనబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పొలిటీషియన్స్, యాక్టర్స్ ఇలా చాలామంది ట్వీట్‌‌‌‌ చేశారు. చాలా ఎమోషనల్‌‌‌‌ అయ్యాను’ అని చెప్పింది హిమ. 2018 ఏషియన్ గేమ్స్ లో 2 గోల్డ్, ఒక సిల్వర్ మెడల్‌‌‌‌ కూడా గెలుచుకున్న హిమను అదే ఏడాది  అర్జున అవార్డ్‌‌‌‌ కూడా వరించింది. నెల తర్వాత ‘యూనిసెఫ్‌‌‌‌ ఇండియా’కు మొదటి యూత్ బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఎంపికై చరిత్రపుటల్లోకీ ఎక్కింది.