వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద జలమండలి ఆధ్వర్యంలో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వాటర్ బోర్డ్ ఎండీ దానకిశోర్ వెల్లడించారు. గతంలో కేవలం నిమజ్జన ఘట్టమైన 11వ రోజున మాత్రమే వాటర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి మాత్రం 3, 5, 7, 9 రోజుల్లో వాటర్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటర్ క్యాంపుల్లో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు క్యూఏటీ బృందాలు పరీక్షించాలని సూచించారు. నగరంలో వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటి అందించే అంశంపై జలమండలి ఎండీ దానకిశోర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాల వద్ద సైతం ఎలాంటి సివరేజి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన మండపాలను, వాటి పరిసరాలను స్వయంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఖచ్చితంగా అన్ని మ్యాన్ హోళ్లకు మూతలుండేలా ఏర్పాటు చేయాలన్నారు. లోతైన మ్యాన్ హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల వేగంగా మరమ్మత్తులను పూర్తి చేయాలని ఆదేశించారు.
మరోవైపు... జలమండలి అవలంబిస్తున్న బిల్లింగ్ విధానం, వినియోగిస్తున్న సాంకేతికత, రెవెన్యూ అంశాలపై అధ్యయనం చేయడానికి ఢిల్లీ జల్ బోర్డు అధికారుల బృందం నగరానికి వచ్చింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం జలమండలి డివిజన్ - 6, 15 పరిధిలోని మాదాపూర్, ప్రశాసన్ నగర్ ప్రాంతాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో జలమండలి వినియోగిస్తున్న మీటర్ల పనితీరు, బిల్లింగ్ చేయడానికి వినియోగిస్తున్న సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత జూబ్లీ హిల్ లోని జలమండలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును సందర్శించి నగరంలో నీటి సంరక్షణ కోసం జలమండలి అవలంబిస్తున్న పద్ధతులు, చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
