న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్‌లో ఏడాది లెక్కన 2 శాతం తగ్గి 95,973 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో 98,095 యూనిట్ల విక్రయాలు జరిగాయి. తక్కువ ధర గల ఇళ్ల సరఫరా తగ్గడం, డిమాండ్ మందగించడమే ఇందుకు కారణమని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ప్రాప్‌టైగర్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.
సిటీల వారీగా ఇండ్ల అమ్మకాలు..
ఐటీ హబ్ బెంగళూరులో అమ్మకాలు ఏడాది లెక్కన 33శాతం పెరిగి 15,603 యూనిట్లకు చేరాయి. అలాగే హైదరాబాద్‌లో 25శాతం వృద్ధితో 13,297 యూనిట్లు, చెన్నైలో 6,841 యూనిట్లు, ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో 11శాతం వృద్ధితో 9,447 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
ముంబై (ఎంఎంఆర్)లో అమ్మకాలు 15శాతం తగ్గి 26,116 యూనిట్లకు పడిపోయాయి. పుణెలో 21శాతం తగ్గి 13,565 యూనిట్లకు, కోల్‌కతాలో 24శాతం తగ్గి 2,883 యూనిట్లకు, అహ్మదాబాద్‌లో 23శాతం తగ్గి 8,221 యూనిట్లకు పడిపోయాయి.
జీసీసీలతో డిమాండ్..
కొత్త ఇళ్ల సరఫరా గతేడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 93,144 యూనిట్లు ఉండగా, ఈసారి 93,065 యూనిట్లతో దాదాపు స్థిరంగానే కొనసాగింది. మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు అదుపులోనే ఉన్నాయని, సరఫరా–-డిమాండ్ మధ్య బ్యాలెన్స్ ఉందని ప్రాప్‌టైగర్ రిపోర్ట్ పేర్కొంది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు), స్టార్టప్‌లు, డీప్-టెక్ కంపెనీలు విస్తరిస్తుండడంతో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి రెసిడెన్షియల్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతోందని వివరించింది.
