దేశంలోని ప్రతి పౌరుడు తన ఇంట్లో ఎంత డబ్బును క్యాష్ రూపంలో ఉంచుకోవాలనే దానిపై ఎటువంటి చట్టపరమైన పరిమితి లేదు. మీ దగ్గర ఒక లక్ష ఉన్నా.. రూ.10 లక్షలు ఉన్నా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దానిపైపై ఎటువంటి గరిష్ట పరిమితిని విధించలేదు. అయితే ఇక్కడ అసలు చిక్కు ఎంత డబ్బు మీదగ్గర ఉంది అనేదానిపై కాదు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానితోనే ఉంటుంది. మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి సరైన లెక్కతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నంత వరకు ఎంత డబ్బునైనా ఇంట్లో భయపడకుండా భద్రపరుచుకోవచ్చు.
లెక్కలు చూపని డబ్బు ఉంటే ముప్పు తప్పదా?
ఒకవేళ ఐటీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మీ వద్ద భారీగా నగదు దొరికితే.. దానికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఆ డబ్బు మీ ఆదాయపు పన్ను రిటర్నులలో చూపిందా? మీ బిజినెస్ అకౌంట్లో నమోదైందా? దానికి సంబంధించిన రిసీట్స్ ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తారు. ఒకవేళ మీరు ఆ డబ్బుకు సరైన మూలాన్ని వివరించలేకపోతే.. దానిని లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణిస్తారు. దానిపై సెక్షన్ 115BBE కింద భారీగా పన్ను విధిస్తారు.
లెక్క చూపని ఆదాయంపై పన్ను భారం ఊహించని విధంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి డబ్బు దొరికినప్పుడు దానిపై 60% పన్నుకు తోడు 25% సర్ఛార్జ్, 4% ఎడ్యుకేషన్ సెస్ విధిస్తారు. అంటే మొత్తం కలిపి దాదాపు 78% పన్ను కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటీ దాడుల్లో ఈ సొమ్ము పట్టుబడితే.. అదనపు పెనాల్టీలతో కలిపి ఈ మొత్తం 84% వరకు చేరుకోవచ్చు. అంటే మీరు లెక్కలు లేకుండా దాచిన ప్రతి రూ.100 లో సుమారు రూ.84 ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తిపోతాయ్. అందుకే లెక్క చూపని డబ్బును ఉంచుకోవడం అత్యంత ఖరీదైన తప్పుగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తారు.
►ALSO READ | మోడీ ఇచ్చిన షాక్: ఒక్కరోజే రూ.14వేలు పెరిగిన తులం బంగారం.. హైదరాబాద్ రేట్లివే..
డబ్బు దాచుకోవడానికి పరిమితి లేకపోయినా.. ఖర్చు చేయడానికి మాత్రం కొన్ని రూల్స్ ఉన్నాయి. సెక్షన్ 269ST ప్రకారం.. ఒక వ్యక్తి నుండి మరో రోజులో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మెుత్తాన్ని డబ్బు రూపంలో చెల్లింపులు చేయకూడదు. అలాగే రూ.20వేల కంటే ఎక్కువ అప్పు ఇవ్వాలన్నా లేదా తీసుకోవాలన్నా నేరుగా క్యాష్ రూపంలో చేయకూడదు. వ్యాపారస్తులు కూడా రూ.10వేల కంటే ఎక్కువ ఖర్చును డబ్బు రూపంలో చెల్లిస్తే.. దానిని ఆదాయపు పన్ను మినహాయింపు కింద చూపలేరు. అలాగే బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.10 లక్షలకు మించి క్యాష్ జమ చేసినా అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది.
గోల్డ్ అండ్ జ్యువెలరీ పరిస్థితి ఏంటి?
డబ్బు లాగానే ఇంట్లో ఉండే బంగారం, నగలపై కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన, కొన్న బంగారానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లు ఉండాలి. ఒకవేళ ఆధారాలు లేకపోయినా.. పెళ్లైన మహిళలకు 500 గ్రాములు, పెళ్లికాని అమ్మాయిలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండేందుకు ఐటీ శాఖ వెసులుబాటు ఇస్తుంది. కానీ అంతకు మించి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపాల్సి ఉంటుంది. సో బంగారం అయినా లేదా డబ్బులైనా పక్కాగా లెక్కలు ఉంటేనే సేఫ్.
