శ్రీరామ జయరామ జయ జయ రామ.. నామ స్మరణతో మార్మోగుతోంది జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం. అంజనేయ స్వామి దీక్షాపరుల సందడితో కాషాయ కళను సంతరించుకుంది. మే 14వ తేదీ ఆదివారం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి దీక్షాపరులు, భక్తులు కొండగట్టుకు భారీగా తరలివస్తున్నారు. గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి వాహనాల్లో.. కాలినడకన దీక్షపరులు ఆలయానికి తరలివస్తున్నారు. కొండ పైకి చేరుకొని ఆంజనేయ స్వామి దర్శించుకుంటున్నారు. దీక్షాపరులు మాల విరమణ చేస్తున్నారు. అనంతరం తలనీలాలు సమర్పించి పుణ్యస్నామాలచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారికి ముడుపులు ముట్టజెప్పి తిరిగి పయమవుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండి క్యూలైన్లో బారులు తీరారు అంజన్న స్వాములు. దీంతో స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. కొండగట్టుకు వెళ్ళేముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ..ఈ క్రమంలో వేములవాడ రాజన్న ఆలయం కాషాయ మయమైంది.

