- గోవిందరాజస్వామి కోనేరు పునరుద్ధరణ షురూ
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలోని చారిత్రాత్మక గోవిందరాజస్వామి ఆలయ కోనేరు పునరుద్ధరణ పనులకు మంగళవారం హైడ్రా శ్రీకారం చుట్టింది. కోనేరు కబ్జాకు గురైందని ఆలయ పూజారి నరహరి కన్నీరు పెట్టుకున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కబ్జాలను తొలగించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం భారీ యంత్రాలతో హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా చెత్తాచెదారం, పూడికతో నిండిపోయిన కోనేరును శుభ్రం చేసే పనులు చేపట్టారు. హైడ్రా కమిషనర్ చొరవతో కోనేరు కబ్జా నుంచి విముక్తి పొందడమే కాకుండా, తిరిగి పూర్వవైభవం రానుండటంపై పూజారి నరహరి, స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

