V6 News

కొంప ముంచిన క్రూడ్ ఆయిల్.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు..

కొంప ముంచిన క్రూడ్ ఆయిల్.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజున కూడా భారీ నష్టాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ విరమణ చర్చలపై అలుముకున్న గందరగోళంతో క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరగటం అతిపెద్ద కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని సెషన్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మన భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను పెంచుతూ డబ్బు కుమ్మరిస్తున్నప్పటికీ ఇవాళ ఇంట్రాడేలో కీలక సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. 

ఉదయం 9.56 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 437 పాయింట్లు నష్టంతో ట్రేడవుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ కూడా 88 పాయింట్లు కోల్పోయి ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 289 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రమే స్వల్పంగా 16 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుత పరిస్థితులతో స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ మార్కెట్లు కూడా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. రూపాయి మారకపు విలువ 20 పైసలు తగ్గి 94 స్థాయిలకు చేరింది. క్రూడ్ ధరలు బ్యారెల్ 104 డాలర్లకు చేరుకోవటమే ఈ పతనానికి కారణంగా తెలుస్తోంది. 

దీనికి తోడు ఆయియా మార్కెట్లు మెుత్తం నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించటంతో ఆ ప్రతికూల సెంటిమెంట్ దేశీయ ఇన్వెస్టర్లను కూడా కుదిపేస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో క్లోజ్ కావటం గమనార్హం. వీటికి తోడు దేశీయంగా కంపెనీలు తమ నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుండటం కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను కొంత దెబ్బతీస్తోందని తెలుస్తోంది.