- రైతు కష్టాలు తీర్చే మల్టీ పర్పస్ మెషిన్
- సోలార్, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ సైకిల్
- ఇల్లు ఊడ్చి.. బరువులు మోసే రోబో
- గ్లోబల్ సమిట్‌లో విద్యార్థులు, టెక్ సంస్థల ఆవిష్కరణలు
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సమిట్ పెట్టుబడులకే కాదు.. అద్భుత ఆవిష్కరణల ప్రదర్శనలకూ వేదికైంది. టెక్ సంస్థలు, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ఇన్నొవేషన్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ గాల్లో ఎగిరే అంబులెన్స్ మొదలుకొని.. వ్యవసాయ పనులను సులభతరం చేసే మెషిన్ల వరకు అనేక ప్రదర్శనలు ఔరా..! అనిపించాయి. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేసేలా విద్యార్థులు, ప్రైవేట్ సంస్థలు చేసిన ఆవిష్కరణల విశేషాలు ఇవీ..
డ్రోన్‌తో ఎయిర్ అంబులెన్స్
సిటీల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా ఎమర్జెన్సీ వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా టిహాన్ సంస్థ అద్భుతమైన ఎయిర్ అంబులెన్స్(హ్యూమన్ క్యారియింగ్ డ్రోన్)ను రూపొందించింది.
ఇది మనిషిని మోసుకెళ్లే డ్రోన్. గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లను చిటికెలో సిటీ హాస్పిటల్ కు తరలించడమే దీని లక్ష్యమని సంస్థ ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు. కేవలం ఇంటి బాల్కనీ అంత స్థలంలోనే ల్యాండ్ అయ్యే ఈ డ్రోన్.. ఆటోనమస్ నావిగేషన్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని ఖరీదు రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఉండొచ్చని.. డీజీసీఏ అనుమతులు వస్తే మరో రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
త్రీ ఇన్ వన్.. హైబ్రిడ్ సైకిల్
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ జెడ్పీహెచ్‌ఎస్ టెన్త్ క్లాస్ విద్యార్థి గణేశ్ చంద్ర రూపొందించిన హైబ్రిడ్ సైకిల్ వావ్.. అనిపించింది. ఎండ ఉంటే సోలార్ తో అన్ లిమిటెడ్ జర్నీ, ఎండ లేకపోతే బ్యాటరీతో 30 కిలోమీటర్ల ప్రయాణం, అదీ లేకపోతే పెడలింగ్.. ఇలా మూడు విధాలుగా దీనిని వాడుకోవచ్చు. ఇందులో కార్ల మాదిరిగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, క్రూజ్ మోడ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండటం విశేషం.
చాట్ జీపీటీతో కోడింగ్.. మల్టీ పర్పస్ రోబో
సంగారెడ్డి ఏటీసీకి చెందిన విద్యార్థులు టెక్నాలజీని వాడటంలో తామేం తక్కువ కాదని నిరూపించారు. ట్రైనర్ల సహకారంతో పదో తరగతి విద్యార్థులు ఏకంగా మల్టీ పర్పస్ మొబైల్ రోబోను తయారు చేశారు. ఇది ఇల్లు ఊడ్వడం, తుడవడమే కాకుండా15 కిలోల బరువును మోస్తుంది. సీసీ కెమెరాతో నిఘా ఉంచడంతో పాటు, టైర్లు మారిస్తే గార్డెన్ లో గడ్డిని కూడా కట్ చేస్తుందని విద్యార్థి భవాని తేజ, ట్రైనర్ మీర్ సిద్దిక్ అలీ తెలిపారు. మొబైల్ ఫోన్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేయవచ్చని వెల్లడించారు.
ఒకే మెషిన్.. ఐదు పనులు
వ్యవసాయంలో కూలీల కొరత, పెట్టుబడి భారాన్ని తగ్గించేలా ఆదిలాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల కాలేజీ విద్యార్థినులు ధనుష, వైష్ణవి కలిసి మల్టీ పర్పస్ అగ్రికల్చర్ మిషన్ ను తయారు చేశారు. సాధారణంగా దున్నడం, నాటడం, మందు కొట్టడం వంటి పనులకు మనుషులు కావాలి. కానీ ఈ ఒక్క యంత్రంతోనే పొలం దున్నడం, విత్తనాలు వేయడం, మట్టి కప్పడం, నీరు పోయడం, మందు పిచికారీ చేయడం.. ఇలా ఐదు పనులు ఏకకాలంలో చేసుకోవచ్చని వాళ్లు వివరించారు.
