సంక్షోభం నుంచి గట్టెక్కించడమే రిషి ముందున్న సవాల్

సంక్షోభం నుంచి గట్టెక్కించడమే రిషి ముందున్న సవాల్

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు 200 ఏండ్ల తర్వాత ఆ పదవి చేపట్టనున్న అతి చిన్న వయసు వ్యక్తిగా రిషి రికార్డు క్రియేట్ చేశారు. 1812లో రాబర్ట్ బ్యాంక్స్ జెంకిన్సన్ 42 ఏండ్ల వయసులో బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టగా.. ఇప్పుడు రిషి సునాక్ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నరు. ఇదిలా ఉంటే ప్రధాని పదవి చేపట్టనున్న రిషికి ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని నడపడం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. 

ద్రవ్యోల్బణం కట్టడి

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాన్ని గాడిన పెట్టలేకనే అధికారం చేపట్టిన 45 రోజుల్లోనే లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. పెరుగుతున్న ఇంధన ధరలు ఒకవైపు.. ఆర్థిక వ్యవస్థ పతనం మరోవైపు వెరసి బ్రిటన్ ను సంక్షోభంలోకి నెట్టాయి. పెరుగుతున్న ధరలతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అనంతరం బ్రిటన్లో ద్రవ్యోల్బణం గత 40ఏండ్ల రికార్డును తిరగరాసింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి యూరోప్ కు సప్లై అయ్యే క్రూడాయిల్ తగ్గిపోవడంతో దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇతర రంగాల మీద కూడా పడింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడి రిషికి పెను సవాల్గా మారనుంది.

పన్నుల కొనసాగింపు

నిజానికి బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకునేందుకు ముంటే బ్రిటన్ ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన లిజ్ ట్రస్ చేపట్టిన పన్ను సంస్కరణలు, వ్యాపారాలపై నియంత్రణ తగ్గించడం తదితర ప్రయోగాలు బెడిసికొట్టాయి. ధనవంతులపై విధించే పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ ను 25 నుంచి 19శాతానికి తగ్గిస్తామన్న ఆమె ప్రకటన ప్రజాగ్రహానికి కారణమైంది. పన్ను తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గి కొత్త అప్పులు తేవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో లిజ్ ట్రస్ తప్పంతా ఆర్థిక మంత్రిపై తోసి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం రిషి సునాక్ కు కత్తి మీద సాము కానుంది. 

ప్రజల అసంతృప్తికి చెక్

బ్రిటన్లో ఆర్థిక అస్థిరత దేశాన్ని ప్రమాదంలో పడేసింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో కరెన్సీ వీలువ భారీగా పతనమైంది. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సైతం హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో కరెంటు బిల్లులు 100శాతం పెరిగాయి. పౌండ్ వాల్యూ 25 శాతం వరకు పతనమైంది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోగా, శీతాకాలం కావడంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రష్యా నుంచి గ్యాస్‌, చమురు సరఫరా నిలిచిపోవడంతో విద్యుదుత్పత్తి ఖర్చు పెరిగి కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో పేద, ధనిక తేడా లేకుండా తాజా బడ్జెట్‌లో విద్యుత్తు ధరలను అందరికీ ఒకే ధరను నిర్ణయించారు. ఇది ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. దానికి చెక్ పెట్టేందుకు వీలైనంత తొందరగా రిషి చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం

బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలు కూడా బ్రిటన్ ను ఆర్థికంగా కుంగదీశాయి. ఈయూలో భాగంగా ఉన్నప్పుడు బ్రిటన్ కు అప్పట్లో రాయితీలు, ప్రోత్సాహకాలు లభించేవి. బ్రెగ్జిట్ కు ముందు ఐరోపా దేశాల్లోని నిపుణులు యూకే వెళ్లి పనిచేసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఐరోపా మార్కెట్లో బిజినెస్ తగ్గిపోతుందన్న భయంతో చాలా కంపెనీలు బ్రిటన్ నుంచి వెళ్లిపోవడం ద్రవ్యోల్బణానికి దారి తీసింది. ఇదే సమయంలో కరోనా దెబ్బతీయడంతో బ్రిటన్ లో నిరుద్యోగం పెరిగిపోయింది. ఆర్థిక వృద్ధి ఆగిపోయింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రధాని బాధ్యతలు చేపట్టడం రిషికి సవాలే అని ఆర్థిక  విశ్లేషకులు అంటున్నారు.