ఇలాంటి వారిని ఏం చేయాలి.. మద్యం మత్తులో గర్భిణిపై భర్త దాడి..కడుపుపై కొట్టడంతో శిశువు మృతి

ఇలాంటి వారిని ఏం చేయాలి.. మద్యం మత్తులో గర్భిణిపై భర్త దాడి..కడుపుపై కొట్టడంతో శిశువు మృతి
  • మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

శివ్వంపేట, వెలుగు : ఓ వ్యక్తి మద్యం మత్తులో గర్భిణి అయిన తన భార్యపై దాడి చేసి, కడుపుపై కొట్టడంతో శిశువు చనిపోయింది. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై మధుకర్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌‌‌‌ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన సునీతకు, శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మ్యాదరి రజనీకాంత్‌‌‌‌తో ఆరేండ్ల కింద వివాహమైంది.

వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా.. సునీత ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. సునీత శనివారం తన తల్లి కడారి నర్సమ్మతో కలిసి నర్సాపూర్‌‌‌‌ వెళ్లి హాస్పిటల్‌‌‌‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం ఇంటికి వచ్చింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రజనీకాంత్‌‌‌‌.. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లారంటూ అత్త, భార్యతో గొడవ పడి దాడి చేశాడు.

ఆదివారం ఉదయం మరోసారి అత్త నర్సమ్మపై దాడి చేయడంతో గమనించిన సునీత అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రజనీకాంత్‌‌‌‌ సునీత కడుపుపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే 108లో నర్సాపూర్‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌లోని నీలోఫర్ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు నార్మల్‌‌‌‌ డెలివరీ చేసినప్పటికీ.. శిశువు చనిపోయింది. రజనీకాంత్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.