హైబ్రిడ్ ఏవియేషన్ డిప్లొమా కోర్సులు.. వచ్చే నెల 15 నుంచి ప్రారంభం

హైబ్రిడ్ ఏవియేషన్ డిప్లొమా కోర్సులు.. వచ్చే నెల 15 నుంచి ప్రారంభం

ఖైరతాబాద్, వెలుగు: ఏవియేషన్ రంగంలో ఉద్యోగాల కల్పనకు స్మార్ట్ జీసీ ప్రొ ఎడ్యుటేక్ సంస్థ సహకారంతో హైబ్రిడ్ ఏవియేషన్ డిప్లొమా కోర్సులను జులై 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ ప్రైజెస్( నిమ్స్ మే) డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 13 ఏండ్లుగా స్కిల్ డెవలప్​మెంట్ కార్యక్రమాలు చేపడ్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వ ఉడాన్ స్కీంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో అనేక రాష్ట్రాల్లో కొత్త ఎయిర్​పోర్ట్ లు ఏర్పాటవుతున్నాయని, వాటికి తగినంత మానవ వనరుల అవసరం ఉంటుందన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చి వంద శాతం ప్లేస్​మెంట్ కల్పించేందుకు గాను 6 నెలల వ్యవధి కలిగిన ఈ కోర్సు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎయిర్​పోర్టుల్లో వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు www.nimsme.org వెబ్ సైట్ సంప్రదించాలన్నారు. సమావేశంలో స్మార్ట్ జీసీ ప్రొ ఎడ్యుటెక్ సంస్థ  ప్రతినిధి సునీశ్ ఎంఎస్, నిమ్స్ మే ఫ్యాకల్టీ మెంబర్లు డాక్టర్ దీబ్యేందు చౌదరి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.