- ముఖ్య అతిథులుగా హాజరుకానున్న జేపీ నడ్డా, బీఎల్ సంతోష్
- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో ఎక్కువ లోక్ సభ సీట్లు గెలవడంపై దిశానిర్దేశం
- మీటింగ్ ఏర్పాట్లపై పార్టీ ఆఫీసులో సమావేశమైన స్టేట్ ముఖ్య నేతలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మొత్తం 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సంస్థాగత ఇన్‌చార్జ్‌ల సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశం రాత్రి వరకు కొనసాగనుంది. ఒకరోజు మాత్రమే జరిగే ఈ మీటింగ్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన జాతీయ ఆఫీసు బేరర్ల సహా మొత్తం 32 మంది నేతలు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ నుంచి పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ మాత్రమే హాజరవుతారు. దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరితో పాటు గోవా, మహారాష్ట్రకు చెందిన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్స్, ఆ రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులు ఈ మీటింగ్‌కు రానున్నారు. ఈ రాష్ట్రాల పరిధిలో సుమారు 140కి పైగా లోక్ సభ స్థానాలు ఉన్నాయి. దక్షిణాది నుంచే ఎక్కువ లోక్‌సభ సీట్లు గెలుచుకోవడంతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు ఎలాంటి వ్యూహంతో జనంలోకి వెళ్లాలి? పార్టీ క్యాడర్‌ను ఇప్పటి నుంచే ఎన్నికలకు ఎలా సిద్ధం చేయాలి అనే దానిపై ఇందులో చర్చిస్తారు.
బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ...
బూత్ స్థాయిలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నడ్డా, బీఎల్ సంతోష్ దిశా నిర్దేశం చేయనున్నారు. మరో 4 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నందున ఇక్కడ బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా ఈ సమావేశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ మీటింగ్‌ను సక్సెస్ చేయడంపై శనివారం సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలు చర్చించారు. ఈ మీటింగ్‌కు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.
మీడియాకు నో ఎంట్రీ..
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ సందర్భంగా పార్టీ స్టేట్ ఆఫీసులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల వల్ల ముఖ్య నేతలనే ఆఫీసులోకి అనుమతి ఇస్తారు. ఇత రాష్ట్రాల నేతల అనుచరులకు, మీడియాకు అనుమతి లేదు.
రేపు బీజేపీ స్టేట్ ఆఫీసు బేరర్ల మీటింగ్..
కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్ జరగనుంది. దీనికి ఆఫీసు బేరర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఎలాంటి కార్యక్రమాలతో జనంలోకి వెళ్లాలనే దానిపై ఇందులో చర్చించనున్నారు.
