హైసెక్యూరిటీ జోన్​గా బీఆర్కే భవన్​!

హైసెక్యూరిటీ జోన్​గా బీఆర్కే భవన్​!

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్​ నిర్మాణం నేపథ్యంలో ప్రస్తుత సెక్రటేరియెలోని మెజారిటీ ఆఫీసులను బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కే) భవన్​కు  తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ భవన్​ వద్ద కల్పించాల్సిన భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.  ఆ ప్రాంతమంతా పోలీస్ పహారాలోకి వెళ్లనుంది. భవనం పరిసరాలను హైసెక్యూరిటీ జోన్ గా పోలీసులు ప్రకటించనున్నారు. బీఆర్కే భవన్​ ముందున్న మూడు రోడ్లను మూసేసి ట్రాఫిక్​ను మళ్లించనున్నారు. ఇక తెలుగు తల్లి ప్లైఓవర్ పై కూడా 24 గంటల పాటు షిప్ట్ ల వారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్కే భవన్, ఫ్లై ఓవర్ రెండు దగ్గరగా ఉండటంతో బందోబస్తు తప్పని సరి అని పోలీసులు భావిస్తున్నారు. ఫ్లైఓవర్ పై ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంటున్నందున పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది.

దీంతో వన్ వే గా చేయాలా అనే ప్రతిపాదన కూడా పోలీసుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీవీఐపీల రక్షణ, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర అంశాలను అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలని పోలీసుశాఖను ప్రభుత్వం కోరింది. ఒకటీరెండు రోజుల్లో అధ్యయనాన్ని పూర్తిచేసి రిపోర్టు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి సమావేశమైన పోలీసులు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. పోలీసుశాఖకు సంబధించిన వివిధ టీమ్​లు  ఇప్పటికే బీఆర్కే భవన్, దాని పరిసర ప్రాంతాలను సందర్శించాయి. అక్కడ తలెత్తే సమస్యలపై దృష్టిసారించాయి. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పలు ఆంక్షలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.

బారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్  మళ్లింపు

బీఆర్కే భవన్ పక్కనే ఉన్న  జీహెచ్ ఎంసీ గేట్ దగ్గర, ఇటు రిట్జ్ హోటల్ కింద కళాంజలి సమీపంలో, మధ్యలో ఆదర్శ్ నగర్  ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కనే ఉన్న రోడ్ లోని హోప్ హాస్పిటల్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్  పోలీసులు సిద్ధమవుతున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద బీఆర్కేఆర్ భవన్ వైపు వెళ్లే జంక్షన్​లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలను నిలువరించనున్నారు. ఇక లిబర్టీ నుంచి జీహెచ్ ఎంసీ, బీఆర్కే భవన్ మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న రహదారులన్నిటినీ మూసేయాలని ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. ప్రజా సంఘాలు, పార్టీల నేతలు సెక్రటేరియెట్​ ముట్టడికి పిలుపునిస్తే నిరసనకారులు వచ్చే ప్రాంతాలు ఏం ఉన్నాయన్న దానిపై పోలీసులు ఈ నివేదికలో పొందుపర్చనున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ లోని మెజార్టీ శాఖలు బీఆర్కే భవన్ కు తరలితే అక్కడ పార్కింగ్ ఓ ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది.  బీఆర్కే భవన్​లో కొన్ని, దాని ముందు రోడ్డుపై మరికొన్ని వాహనాలు పార్క్ చేసే వెసులుబాటు ఉంది. అదీకాక పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఖాళీ స్థలాన్ని సైతం పార్కింగ్ కోసం ఉపయోగించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు.

మిగిలిన శాఖలు
ఆదర్శ్​నగర్​ ఎమ్మెల్యే క్వార్టర్స్​లోకి

బీఆర్కే భవన్ లో మెజార్టీ శాఖలను షిప్ట్ చేసిన తర్వాత మిగిలిన శాఖలను ఆదర్శనగర్​లో ఇటీవల ఏపీ ప్రభుత్వం అప్పగించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని 25 బిల్డింగ్స్​లోకి షిఫ్ట్​ చేయనున్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని బీఆర్కేఆర్ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆ పరిసరాలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని రహదారులపై వాహన రాకపోకలను అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరనుంది.

బీఆర్కే భవన్ సురక్షితమేనా ?

సెక్రటేరియట్ లోని మెజారిటీ శాఖలు తరలించనున్న బూర్గుల రామకృష్ణారావు భవన్ సురక్షితమేనా అన్న అనుమనాలు  ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినా, షార్ట్ సర్క్యూట్ జరిగినా సురక్షితంగా బయటకు తీసుకరావచ్చా.. ఇందుకు ఆ బిల్డింగ్​లో ఫైర్ సేప్టీ పరికరాలు ఉన్నాయా అని షిఫ్ట్​అయ్యే శాఖల ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. ఈ భవనం మెయిన్ రోడ్డు మీద ఉండటం, పక్కనే జీహెచ్ ఎంసీ ఆఫీసు, మరో పక్క తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఉండటం, పైగా చాలా తక్కువ స్థలంలో ఈ భవనం ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.

వేగంగా బీఆర్కే భవన్ ఖాళీ

సెక్రటేరియెట్​లోని శాఖలను బీఆర్కే భవన్​కు తరలించనున్న నేపథ్యంలో భవన్​లోని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించే పక్రియ వేగంగా సాగుతోంది. గత రెండు రోజులుగా సాంకేతిక విద్యా శాఖ , మార్కెటింగ్ శాఖ కార్యాలయాల సామగ్రిని తరలించిన సిబ్బంది గురువారం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలోని ఫర్నిచర్, సామాగ్రిని లక్డీకపూల్ లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇక 7వ ఫ్లోర్ లో గల గనులు భూగర్భశాఖ కార్యాలయంలోని ఫైళ్లను ప్యాక్ చేశారు. అయితే వాటిని ఎక్కడికి తరలించాలన్న విషయమై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, రాగానే తరలించే కార్యక్రమం మొదలు పెడతామని అక్కడి సిబ్బంది అంటున్నారు. ఇదిలా ఉంటే గురువారం బీఆర్కే భవన్ ను జీఏడీ అధికారులు పరిశీలించారు. జీఏడీ డిప్యూటీ సెక్రటరీ చిట్టిరాణి ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడి కార్యాలయ తరలింపు ఎలా జరుగుతోంది, ఖాళీ అయిన చోట్ల చేయాల్సిన మైనర్ మరమ్మతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ సరఫరా, వెలుతురు ఎలా ఉంది అన్న విషయాల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.