రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్

రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్

హైదరాబాద్:  రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోనున్నాయి. వేసవి సెలవుల వేళ పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం కరువు కానుంది. ముఖ్యంగా పట్టణాల్లో సినిమాల ప్రదర్శన నిలిచిపోనుంది. నగరాలు, మహానగరాల్లోని మల్టీప్లెక్స్ లతోపాటు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తుండటం వల్లే పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ పాటించనున్నాయి. ఈ నెల 17వ తేదీ(శుక్రవారం) నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 800 సింగిల్ స్క్రీన్ థియేటర్లున్నాయి. ఏపీలో 1200 సింగిల్  స్క్రీన్ టాకీసులు కొనసాగుతున్నాయి. ఏపీలోనూ ఇలాంటి నిర్ణయమే వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలోని 800 థియేటర్లలో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్నసింగిల్ సింగిల్ స్క్రీన్ టాకీసుల్లో పది రోజుల పాటు సినిమాల ప్రదర్శన నిలిచిపోయే అవకాశం ఉంది.  

నిర్వహణే భారం


ప్రతి ఏడాదీ వేసవిలో చిన్న, పెద్ద సినిమాలు  రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి ఎన్నికల కారణంగా సినిమాల రిలీజ్ కు బ్రేక్ పడింది. దీంతో కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో రాలేదు. వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గవి లేకపోవడం, ఐపీఎల్ సీజన్ నడస్తుండటంతో యువత పెద్ద ఎత్తున టీవీలకు అతుక్కుపోతోంది. ముఖ్యంగా ఫస్ట్, సెకండ్ షోలకు జనం రావడం గణనీయంగా తగ్గింది. మొన్నటి వరకు ఎన్నికలు ఉండటంతో చాలా మంది క్యాంపెయిన్ లో బిజీగా గడిపారు. సాధారణ సినిమాలను ప్రదర్శించడం వల్ల కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని థియేటర్ల యజమానులు చెబుతున్నారు.  ఒక్కో షోకు పది టికెట్లు అమ్ముడు పోవడమే కష్టంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితిలో నడపడం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్‌ అద్దెలు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు.

నగరాల్లో నడుస్తయ్


హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరంనగర్, ఖమ్మం వంటి నగరాల్లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు బంద్ ఉండవు. ఇక్కడ ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయి. చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోని థియేటర్లు నిర్వహణ భారంతో పది రోజుల పాటు ఆటలు రద్దు చేస్తారని సమాచారం.