జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే

జూన్ 4న అధికారంలోకి  ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే

లక్నో: నాలుగు విడతల్లో జరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉందని, దేశ ప్రజలు మోదీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించారని, ఓటు ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇవాళ లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేవని అన్నారు. మన భవిష్యత్ తరాలు, వాళ హక్కులు, రిజర్వేషన్లను రక్షించడానికి ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ఇండియా అలయన్స్ పోరాడుతోందని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షిస్తేనే ప్రజలకు హక్కులుంటాయని అన్నారు.  

ఓటు ఉంటే ఎవరినైనా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోగలమని అన్నారు.  నియంతృత్వం, నిరంకుశత్వం ఉంటే ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందని అన్నారు.  బీజేపీకి బలం ఉన్న చోట తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఆపి ఏజెంట్లను మభ్యపెడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి బురఖాపై కన్నేశారని గుర్తు చేశారు.  దేశానికి ఎన్నో ఇచ్చామని చెబుతూ బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘గాంధీజీ స్వాతంత్ర్యం తెచ్చారు, నెహ్రూజీ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సృష్టించారు.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారు..’అని అన్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడుతున్నా మోదీ మౌనంగా కూర్చున్నారని, అలా మాట్లాడటం దేశద్రోహమని అనలేదని ఆరోపించారు.