పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. రీల్స్ కోసం రైలు కింద పడుకొని వీడియో.. తెల్లారేసరికి అరెస్ట్..

పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. రీల్స్ కోసం రైలు కింద పడుకొని వీడియో.. తెల్లారేసరికి అరెస్ట్..

రీల్స్ పిచ్చి రోజురోజు మితిమీరిపోతుంది. కొందరు వ్యూస్ కోసం వింత వింత చేష్టలు చేస్తుంటే మరికొందరు మాత్రం ప్రాణాలను లెక్క చేయకుండా... కాస్త మిస్ అయితే ప్రాణాలు పోతుండేవి అనేలా వీడియోలు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా పిచ్చి పిచ్చి స్టంట్స్  చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రదేశాలలో రీల్స్ చేస్తూ  పట్టుబడి కేసులు బుక్ చేసిన కొందరు మాత్రం తీరు మార్చుకోవట్లేదు.  

యూపీ రాష్ట్రంలో ఓ యువకుడు సోషల్ మీడియా రీల్స్ చేసేందుకు ఏకంగా  ప్రాణాలనే రైలు కింద పెట్టాడు. రైలు అతని మీద నుండి వెళ్తున్నా భయం లేకుండా పట్టాల మధ్యలో పడుకుని వీడియో కూడా తీసాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన అజయ్ రాజ్‌బర్ అనే ఇన్‌స్టాగ్రామ్ వీడియో క్రియేటర్ ఒక ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. రైలు వేగంగా వస్తుండగా అతను రైలు పట్టాల మధ్య పడుకున్నాడు. రైలు పూర్తిగా అతని మీద నుండి వెళ్ళిపోయే వరకు అలాగే పడుకొని ఉన్నాడు. ఈ భయంకరమైన దృశ్యాన్ని  మొబైల్ ఫోన్‌లో కూడా వీడియో తీస్తూ రికార్డ్ చేశాడు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని చేసిన ఈ భయంకరమైన విడియో చివరలో ఎవరూ ఇలాంటి పనులు చేయకండి అని  చెప్పినప్పటికీ,  రీల్స్ కోసం రైల్వే పట్టాల మధ్యలో పడుకొని స్టంట్ చేయడం చట్టరీత్యా  నేరం కావడంతో పోలీసులు అతని పై చర్యలు చేపట్టారు.

అజయ్ రాజ్‌బర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెడీ అండ్ ప్రాంక్  వీడియోలు చేస్తుంటాడు. వ్యూస్ కోసం ఇలాంటి భయపెట్టే, ఆందోళన కలిగించే వీడియోలు చేస్తుంటాడు.

గతంలో జరిగిన విషాదం
ఇలాంటి రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. అక్టోబర్ 21న పూరి జిల్లాలో 15 ఏళ్ల విశ్వజీత్ సాహు అనే బాలుడు రైల్వే ట్రాక్‌పై రీల్ షూట్ చేస్తూ రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించాడు.