బషీర్‌బాగ్, వెలుగు: పెట్టుబడులు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన కేసులో మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ఆరుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్ బాబు తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ఒకరు ఉన్నట్లు వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2026లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని వాట్సాప్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ద్వారా మోసగాళ్లు సంప్రదించారు.
అధిక లాభాలు, ఐపీఓ కేటాయింపులు వస్తాయని నమ్మించి నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. తొలుత రూ. 1.05 లక్షలు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం 19 విడతల్లో మొత్తం రూ.1,22,18,029 పెట్టుబడి పెట్టించారు. నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై రూ. 15.69 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, ఆ ఐపీఓలను విడుదల చేయాలంటే అదనంగా రూ.35 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మ్యూల్ ఖాతాలు తెరిచి..
దర్యాప్తులో కీలక నిందితుల్లో ఒకరు అధిక విలువ కలిగిన కరెంట్ బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఓ కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆ ఖాతాల ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు ఇచ్చి, సైబర్ నేరాల ద్వారా వచ్చిన నిధులను దారి మళ్లించేందుకు ఉపయోగించినట్లు డీసీపీ తెలిపారు.
కమీషన్ ప్రాతిపదికన వ్యాపార ఖాతాలు సమకూర్చడం, రిమోట్ యాక్సెస్, ఓటీపీ మానిప్యులేషన్ ద్వారా ఖాతాలను యాక్టివేట్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, 4 ఏటీఎం కార్డులు, 2 చెక్కు పుస్తకాలు, 2 బ్యాంక్ పాస్‌బుక్కులు, 3 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
