చెరువులను పరిశీలించిన హైడ్రా చీఫ్

చెరువులను పరిశీలించిన హైడ్రా చీఫ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  నగరంలోని పలు చెరువులను, నాలాలను శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  శుక్రవారం పరిశీలించారు. సున్నం చెరువుకు వెళ్లిన రంగనాథ్​మురుగు నీటి కాలువల డైవర్షన్ పనులను చూశారు. అల్లాపూర్, బోరబండ డివిజన్ల మీదుగా సాగే నాలాలను  పరిశీలించి విస్తరించాలని ఆదేశించారు. పద్మావతి నగర్ వద్ద నాలాను ఆక్రమించి ఇటీవల నిర్మించిన షెడ్లను  తొలగించాలని స్థానికులు కమిషనర్ ను కోరారు. 

బోరబండ మీదుగా హైటెన్షన్ కరెంటు తీగల రోడ్డులో ఆక్రమణలు రావడాన్ని కమిషనర్ కు స్థానికులు చూపించారు. సున్నం చెరువు అభివృద్ధి పనులను స్వాగతిస్తూ బోరబండ, అల్లాపూర్ కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్,సబీహా బేగం కమిషనర్ ను సన్మానించారు. గచ్చిబౌలిలోని ఎన్జీవో  కాలనీలోని మూసాయికుంట, గోసాయికుంటలను, వనస్థలిపురంలోని చింతలకుంట పరిసరాలను హైడ్రా కమిషనర్  సందర్శించారు. మన్సూరాబాద్​లోని వివేకానందనగర్​లో రోడ్ల కబ్జాలను చూసి విచారణకు ఆదేశించారు.

 బడంగ్ పేట మెయిన్​రోడ్డును దాటుకుంటూ మీర్ పేట్  పెద్దచెరువుకు వెళ్లే నాలా విస్తరణ పనులను, బండ్లగూడ, జల్ పల్లి పరిసరాల్లోని పెద్దచెరువు, హుందాసాగర్ చెరువులను పరిశీలించారు. కబ్జాలు జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో డ్రోన్ ద్వారా  చెరువును  చిత్రీకరించాలన్నారు.