హైదరాబాద్ సిటీ, వెలుగు: యూసుఫ్‌గూడలోని కృష్ణా నగర్లో 40 ఏండ్ల నాటి పురాత పైప్‌లైన్‌తో ఎదురవుతున్న సమస్యలకు వాటర్‌బోర్డు అధికారులు చెక్‌పెట్టారు. ఎప్పుడో వేసిన 300 మి.మీ వ్యాసం సీవరేజ్ లైన్ దెబ్బతిని, సిల్ట్‌తో నిండిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో ఈ ప్రాంతంలో తరచూ లీకేజీలు, కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం బోర్డు 450 మిమీ డయా గల ఆర్సీసీ ఎన్పీ 4 సీవరేజ్ లైన్ నిర్మాణం చేపట్టింది.
మెట్రో రైల్నిర్మాణ టైంలో ఈ లైన్ దెబ్బతినడంతో తాత్కాలికంగా స్టార్మ్ వాటర్ డ్రైన్‌కు మళ్లించారు. దీని వల్ల వర్షాకాలంతో పాటు సాధారణ రోజుల్లోనూ సీవరేజ్ ఓవర్‌ఫ్లో, కలుషిత నీటి సరఫరా, దుర్వాసన వంటి సమస్యలు పెరిగాయి. రోజుకు 15 నుంచి 20 ఫిర్యాదులు వస్తుండడంతో ఆదివారం రాత్రి పనులు చేపట్టారు. త్వరలోనే పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు.

