V6 News

డిప్యూటీ సీఎం భట్టి సీపీఆర్వో మధు సూదన్ గుండెపోటుతో మృతి

డిప్యూటీ సీఎం భట్టి సీపీఆర్వో మధు సూదన్ గుండెపోటుతో మృతి
  •     సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సంతాపం
  •     నేడు మిర్యాలగూడలో అంత్యక్రియలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(సీపీఆర్వో)​గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ (50) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ ఆకస్మిక మరణంతో జర్నలిస్టులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన మధుసూదన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో సీనియర్ జర్నలిస్ట్​గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 

ఆయనకు భార్య,  ఒక కుమారుడు ఉన్నారు.  సోమవారం మధ్యాహ్నం ఛాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఆ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. రెండోసారి కార్డియాక్ అరెస్ట్ కావడంతో చనిపోయారు. మధుసూదన్​ స్వగ్రామమైన మిర్యాలగూడలో నేడు (మంగళవారం) అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

హాస్పిటల్​కు వెళ్లి మంత్రి పొన్నం నివాళి

మధుసూదన్ మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ హుటాహుటిన హాస్పిటల్​కు వెళ్లి నివాళి అర్పించారు. అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన సీపీఆర్వో మధుసూదన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాయితీగల పాత్రికేయుడిని కోల్పోవడం బాధగా ఉందన్నారు. 

అతని కుటుంబానికి అండగా ఉంటామని మాటిచ్చారు. రాష్ట్ర మంత్రులు వివేక్​ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రెస్​క్లబ్ సంతాపం

పంజాగుట్ట, వెలుగు: మధుసూదన్ ఆకస్మిక మరణంపై హైదరాబాద్ ప్రెస్​క్లబ్ తీవ్ర సంతాపం తెలియజేసింది. క్లబ్ అధ్యక్షుడు విజయ్​కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల అమీర్​పేట స్పెక్ట్రా ఆస్పత్రిలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.