- నేరాలకు కేరాఫ్ గా మారిన మిల్స్ కాలనీ, సుబేదారి పీఎస్ లు
- పర్యవేక్షణ కొరవడి పెరుగుతున్న దారుణాలు
- కాగితాలకే పరిమితమైన కొత్త స్టేషన్ల ఏర్పాటు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో క్రైమ్ కంట్రోల్ తప్పుతోంది. మాస్ ఏరియా ఎక్కువగా ఉండే మిల్స్ కాలనీ పరిధిలో తరచూ దాడులు, మర్డర్లు జరుగుతుండగా, ఎంప్లాయిస్, పొలిటికల్ లీడర్లు, వివిధ ఆఫీసులతో క్లాస్ ఏరియాలు ఉండే సుబేదారి పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ లు కలకలం రేపుతుండగా, మరికొన్ని స్టేషన్ల లిమిట్స్ లో గంజాయి గ్యాంగ్ ల ఆగడాలు పెరుగుతున్నాయి.
ఇటీవల నగరంలో జరుగుతున్న ఘటనలు కలవరానికి గురి చేస్తుండగా, పోలీసుల నిఘా కొరవడే నేరాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే వరంగల్ కమిషనరేట్ లో కొత్త స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియపై చర్చ జరుగుతోంది. స్టేషన్ ల పరిధి ఎక్కువగా ఉండటం పోలీసులకు సవాల్ గా మారగా, నేరాల నియంత్రణకు కొత్త పీఎస్ లు ఏర్పాటు చేసి నిఘా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రెండు స్టేషన్లు.. నెలకు 60కిపైగా కేసులు
గ్రేటర్ సిటీ పరిధిలో వరంగల్ వైపు మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, మట్వాడా, ఏనుమాముల, హనుమకొండ వైపు హనుమకొండ, సుబేదారి, కాజీపేట, మడికొండ, కాకతీయ యూనివర్సిటీ, హసన్ పర్తి పోలీస్ స్టేషన్లున్నాయి. ఈ పది స్టేషన్లలో మిల్స్ కాలనీ పీఎస్ క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఈ నెల 19న బిహార్ కు చెందిన 60 ఏండ్ల వృద్ధుడు హత్యకు గురి కాగా, అంతకుముందు రూ.5 వేలు సుపారీతో తీసుకుని కల్యాణ్ అనే యువకుడు సురేశ్అనే వ్యక్తిని చావబాదాడు.
ఓ వైన్స్ షాప్ పై కొంతమంది యువకులు గంజాయి మత్తులో దాడికి దిగి అక్కడి బైకులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇలా ఏటా ఈ స్టేషన్ లో అన్నీ కలిపి 800కుపైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పటివరకు 260కిపైగా ఎఫ్ఐఆర్ లు ఫైల్ అయ్యాయి. అంటే నెలకు సగటున 60కిపైగా కేసులు నమోదు అవుతుండటం గమనార్హం.
వీఐపీలు ఉండే ఏరియాలో స్నాచింగులు..
సిటీలో మరో ప్రధానమైన స్టేషన్ సుబేదారి. ఈ స్టేషన్ పరిధిలోనే హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లు, జడ్పీ ఆఫీస్లు, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, ఎన్పీడీసీఎల్ బిల్డింగ్, డీఈవో ఆఫీసులు, ఇతర కార్యాలయాలతో పాటు పలువురు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇతర పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్లు నివాసం ఉండే వివిధ కాలనీలున్నాయి. కాగా, ఇక్కడ తరచూ చైన్ స్నాచింగులు కలకలం రేపుతున్నాయి. వాటితోపాటు దాడులు, దౌర్జన్యాలు, ఇతర నేరాలతో ఈ స్టేషన్ లో ఇప్పటికే 205కుపైగా కేసులు నమోదయ్యాయి. నెలకు సగటున 50కిపైగా కేసులు నమోదవుతుండగా, ఎఫ్ఐఆర్ ఫైల్ కాని ఘటనలు చాలానే ఉంటున్నాయి.
ప్రతిపాదనల్లోనే కొత్త స్టేషన్లు..
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 46 లా అండ్ ఆర్డర్, మూడు ట్రాఫిక్, ఒకటి నార్కొటిక్, ఒకటి సైబర్ క్రైమ్, ఒక సీసీఎస్ స్టేషన్ తోపాటు రెండు విమెన్ పీఎస్ లు ఉన్నాయి. ఇందులో సిటీలోని లా అండ్ ఆర్డర్ స్టేషన్ల పరిధి చుట్టూ ఐదారు కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉండటంతో సిబ్బంది పర్యవేక్షణకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో క్రైమ్ కు ఆస్కారం ఏర్పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే వరంగల్ కమిషనరేట్ లో జనాభా, క్రైమ్ పరిస్థితుల దృష్ట్యా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఇందులో ప్రధానంగా సుబేదారి పరిధిలో వడ్డేపల్లి, న్యూశాయంపేట, మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీలో కొత్త పీఎస్ ఏర్పాటు కోసం ప్రపోజల్స్ పంపించారు.
కానీ, ఏండ్లు గడుస్తున్నా కొత్త స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదలడం లేదు. అంతేగాకుండా జనగామ, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, ఆత్మకూరు, కేయూ పరిధిలో ట్రాఫిక్ పీఎస్ లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కానీ వాటికీ మోక్షం కలగడం లేదు. ఇటీవల కాలంలో వరంగల్ నగరంలో జరుగుతున్న ఘటనలతో కొత్త స్టేషన్ల ఏర్పాటు ఆవశ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఆ దిశగా లీడర్లు, ఆఫీసర్లు చొరవ చూపాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాం..
కొత్త స్టేషన్ల ఏర్పాటు కోసం గతంలోనే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. కొత్త స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ విచారణ అనంతరం కొత్త స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. - సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్

