- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రాష్ట్రాలను సంప్రదించకుండానే అమెరికాతో వాణిజ్య ఒప్పందం
- కేంద్రం తీరు వల్ల రాష్ట్రంపై ఏటా రూ.5 వేల కోట్ల అదనపు భారం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే దేశవ్యాప్తంగా రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఒప్పందానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతోనే మార్కెట్‌లో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని తెలిపారు. మక్కల ధరలు దాదాపు 30 శాతం వరకు పడిపోగా, సోయాబీన్, పత్తి ధరలు 20 శాతం వరకు తగ్గడం రైతులను దెబ్బతీస్తోందన్నారు.
వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి మొక్కజొన్న, సోయా ఆయిల్ దిగుమతులు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల దేశీయంగా సోయాబీన్, మొక్కజొన్నకు డిమాండ్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పంటలపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాష్ట్రాలతో చర్చించకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాణిజ్య ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్చేశారు.
ఎంఎస్పీకి చట్టబద్ధత లేక రైతులకు నష్టం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎంఎస్పీ ప్రకటించిన పంటలను కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోళ్లను విస్మరించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిపారు. కేంద్రం తీరు వల్ల రాష్ట్రంపై ఏటా రూ.3 వేల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని వివరించారు. ఎరువుల సరఫరాపై స్పష్టత లేకపోవడం రైతులకు సమస్యగా మారిందన్నారు.

