
ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఫార్ములా - ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు హైదరాబాద్ హోస్ట్ గా వ్యవహరించనుంది. హెచ్ఐసిసి స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ రేసింగ్ ఈవెంట్ కు సంబంధించి ప్రకటన చేశారు. టికెట్ రేట్లు, ఎలా బుక్ చేసుకోవాలన్న విషయాలను వెల్లడించారు. ఈ రోజు నుంచి బుక్ మై షో, పేటీఎం ఇన్ సైడర్ లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ రేసింగ్ ఈవెంట్ లో 11 టీమ్స్, 22 కార్లు పాల్గొంటాయి. ప్రేక్షకుల కోసం 22 వేల కెపాసిటీతో గ్యాలరీ సిద్ధం చేశారు. రేసింగ్ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు ప్రకటించారు. భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని, సంవత్సరం మొదట్లోనే అత్యంత ఘనమైన కార్యక్రమంగా ఫార్ములా ఈ రేస్ నిలవబోతుందని అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రేసింగ్ చూసేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.