సక్సెస్ అయినా..సంపులను గాలికొదిలేసిన్రు.. భూగర్భ సంపులపై ఎక్కడాలేని నిర్లక్ష్యం

సక్సెస్ అయినా..సంపులను గాలికొదిలేసిన్రు.. భూగర్భ సంపులపై ఎక్కడాలేని నిర్లక్ష్యం
  • 50 కడతామని..11 దగ్గరే చేతులెత్తేశారు
  • సీఎం చెప్పినా.. ఆఫీసర్లకు ‘లైట్’
  •  కళ్లముందే అద్భుతాలు కనిపిస్తున్నా కొత్తవి కట్టట్లేదు
  • స్థలాల సాకుతో అధికారుల కాలయాపన

గ్రేటర్ జలగండానికి శాశ్వత పరిష్కారం కోసం తెచ్చిన ‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల’ (భూగర్భ సంపులు) ఏర్పాటు అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కుతోంది. నగరవ్యాప్తంగా 50 స్ట్రక్చర్లు నిర్మిస్తామని గతేడాది అట్టహాసంగా ప్రకటించిన అధికారులు.. చివరకు 11 నిర్మాణాలతోనే సరిపెట్టి, మిగిలిన చోట్ల స్థలం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. కళ్లముందే అద్భుత ఫలితాలు కనిపిస్తున్నా కొత్తవి కట్టట్లేదు.

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ భూగర్భ సంపులు (వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు) అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో వాన పడితే నడుములోతు నీళ్లతో నిండిపోయే రాజ్​భవన్ రోడ్, సోమాజిగూడ ఆర్టీవో ఆఫీస్ పరిసరాల్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా వెంటనే స్ట్రక్చర్లలోకి చేరుతోంది.

 రాజ్ భవన్ రోడ్డులో ఏకంగా 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినా.. దాదాపు 10 లక్షల లీటర్ల నీరు ఈ సంపుల్లోకి చేరిపోవడంతో రోడ్డుపై చుక్క నీరు కూడా నిలవడం లేదు. లోపలికి చేరిన నీటిని అధికారులు 25 హెచ్​పీ కెపాసిటీ పంపు మోటార్ల ద్వారా వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అక్కడ గతంలో కనిపించిన ట్రాఫిక్ కష్టాలు చాలావరకు తప్పాయని స్థానికులు చెప్తున్నారు.

 సీఎం చెప్పినా.. కదలని ఆఫీసర్లు 

ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్పట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. పనులు జరుగుతున్న సమయంలో స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అసెంబ్లీతో పాటు పలు సందర్భాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు సిటీకి ఎంత అవసరమో వివరించారు. మరిన్ని నిర్మించాలని కూడా అధికారులను ఆదేశించారు. కానీ ఫీల్డ్ స్థాయిలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‘‘వర్షపు నీరు చేరే ప్రాంతాల్లో తవ్వడానికి స్థలాలు లేవు, అక్కడ తవ్వితే వేరే ఇబ్బందులు వస్తాయి”అంటూ మూడు కార్పొరేషన్ల అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వానాకాలం గట్టెక్కేదెలా?

వర్షాకాలానికి ముందే పూర్తి చేయాల్సిన ‘ప్రీ-–మాన్సూన్’ పనులు అధికారులు కాలయాపన చేస్తుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు. కీలక జంక్షన్లు, లోతట్టు ప్రాంతాల్లో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీటి సమస్యకు చాలా వరకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో అవసరమున్న ఈ ప్రాజెక్టును అధికారులు గాలికొదిలేయడంతో.. ఈ వర్షాకాలంలో కూడా నగరవాసులకు జలగండం తప్పేలా లేదనిపిస్తోంది.