- వెంటనే తొలగించాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి టౌన్షిప్లో అనుహర్ హోమ్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన మార్నింగ్ రాగా గేటెడ్ కమ్యూనిటీని శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. కమ్యూనిటీకి రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో పాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు.
రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంచిరేవుల దగ్గర మూసీని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. నదీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదిత్య, ఎన్ సీసీ, రాజపుష్ప నిర్మాణ సంస్థలను ఆదేశించారు. అయితే, మట్టిని పూర్తిగా తొలగిస్తామని నిర్మాణ సంస్థలు హామీ ఇచ్చాయి.

