హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం జరిగిన ప్రజావాణికి 46 ఫిర్యాదులందాయి. అర్జీలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
మేడ్చల్ మండలంలోని కండ్లకోయ విలేజ్‌లో కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి డంపింగ్ యార్డుగా మారిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఆ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసమే వినియోగించేలా చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కురుములగూడ జన్నారం కాలనీలో రాజీవ్ గృహకల్పలో ఉంటున్న వారు పార్కింగ్ కోసం ఉంచిన స్థలాన్ని కబ్జా చేశారని పలువురు కంప్లయింట్ ఇచ్చారు. బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్‌లో తుర్క చెరువు కబ్జాపై ఫిర్యాదు వచ్చింది.
కలెక్టరేట్ లో 390 ఫిర్యాదులు...
హైదరాబాద్ కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితో కలిసి అడిషనల్ కలెక్టర్ కదిరవన్ పలని ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 390 ఫిర్యాదులు వచ్చాయి.
