- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగం మందగించడానికి హైడ్రా కారణం కాదని, దేశ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, జీతాలు ఇలా అనేక అంశాలు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బుధవారం బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌లో తెలంగాణ రియల్టర్స్ ఫోరం నిర్వహించిన ‘రియల్టర్స్ సమిట్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. రియల్టర్లు కేవలం కమీషన్, లాభాల కోసమే కాకుండా వినియోగదారులకు సురక్షితమైన ఆస్తులను అందించే బాధ్యత తీసుకోవాలన్నారు.
మార్కెట్ తగ్గడానికి హైడ్రా కారణం కాదని, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే కారణమని స్పష్టం చేశారు. సిటీని పర్యావరణహితంగా మార్చేందుకే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని, గత 23 నెలల్లో రూ. 1.10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని చెప్పారు. బడా బాబుల ఆక్రమణలను శాస్త్రీయంగా తొలగిస్తున్నామని, పేదలకు ఎలాంటి నష్టం చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ దరమ్‌తో సహా ఇతరులు పాల్గొన్నారు.
