హైదరాబాద్ లో అక్రమణలు, భూ కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచింది. మరోసారి వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. ఫిబ్రవరి 10న ఉదయం కొండాపూర్లో కబ్జాకు గురైన రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.
కొండాపూర్ లోని శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనగూడ మార్గంలో జంగమోని కుంట ఆక్రమణలపై రెవెన్యూ అధికారులతో కలసి హైడ్రా పరిశీలించింది. 4 ఎకరాల జంగమోని కుంట కబ్జాకు గురైనట్లు గుర్తించారు. మట్టి పోసి చదును చేసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధ మయ్యారు కబ్జాదారులు. ఈ క్రమంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి కబ్జాదారులపై కేసు పెట్టారు.
ఫిబ్రవరి 9న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలో ఉన్న పార్కును కబ్జా నుంచి హైడ్రా కాపాడింది. నార్సింగ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు చేరువలో అరుణోదయ కాలనీ హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 6078 గజాలను పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న కొందరు..3 వేల గజాల వరకూ ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన 3 వేల గజాల పార్కు స్థలంలో రూ. 60 కోట్ల విలువైన 1600ల గజాలను స్థానికంగా ఉన్న వ్యక్తి కబ్జా చేశారు. ప్రహరీ నిర్మించి.. అందులో షెడ్లు వేశారు. దీనిపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా , రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణకు గురైన 3 వేల గజాలను కాపాడారు.
